ఇంగ్లాండ్‌లో టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిందే మూడు సార్లు, మరి ఈసారి కోహ్లీసేన సాధ్యమేనా...

First Published Aug 3, 2021, 12:13 PM IST

ఇంగ్లాండ్, ఇండియా టెస్టు సిరీస్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌లో భారత జట్టు ఇప్పటిదాకా టెస్టు సిరీస్‌ గెలిచింది మూడంటే మూడుసార్లు.... అవి ఎప్పుడు, ఎవరి కెప్టెన్సీలో గెలిచారంటే...

స్వాతంత్య్రానికి ముందు 1932లో తొలిసారి, భారత జట్టు, ఇంగ్లాండ్‌లో పర్యటించింది. జూన్ 25, 1932న ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ మైదానంలో టీమిండియా తొలి టెస్టు ఆడింది. ఈ పర్యటనకు సీకే నాయుడు కెప్టెన్‌గా వ్యవహరించాడు...

అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా, మూడు సార్లు సిరీస్ విజయాలను అందుకుంది. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై టెస్టు మ్యాచులు గెలిచినా, సిరీస్‌ గెలవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది...

టీమిండియా తొలి టెస్టు ఆడిన 39 ఏళ్లకు ఇంగ్లాండ్ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించింది. 1971లో అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో భారత జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లింది...

సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, ఏక్‌నాథ్ సోల్కర్, బిషన్ సింగ్ బేడీ, ఎస్ వెంకటరాఘవన్ వంటి ప్లేయర్లతో కూడిన భారత జట్టు, లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టును డ్రా చేసుకోగలిగింది. 

ఆ తర్వాత ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన రెండో టెస్టు కూడా డ్రాగా ముగియగా, ఓవల్‌లో జరిగిన మూడో టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, 1-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది...

భారత బౌలర్ భగవత్ చంద్రశేఖర్ 38 పరుగులకే 6 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు విజయాన్ని అందుకుంది. 

ఈ సిరీస్‌లో కెప్టెన్ అజిత్ వాడేకర్ మూడు టెస్టుల్లో 204 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, శ్రీనివాసరాఘవన్ 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.

తొలి సిరీస్ విజయాన్ని అందుకున్న 15 ఏళ్లకు అంటే 1986లో ఇంగ్లాండ్ పర్యటనలో రెండో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది భారత జట్టు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ గెలిచింది...

1986లో లార్డ్స్ మైదానంలో తొలి విజయాన్ని అందుకుంది భారత జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో చేతన్ శర్మ 5 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 264 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దిలీప్ వెంగ్‌సర్కార్ 126 పరుగులు, మోహిందర్ అమర్‌నాత్ 69 పరుగులతో రాణించడంతో టీమిండియా 341 పరుగులు చేయగలిగింది.

రెండో ఇన్నింగ్స్‌లో మోహిందర్ సింగ్ 3/9, కపిల్‌దేవ్ నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ జట్టు 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 134 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి ఛేదించిన టీమిండియా, 54 ఏళ్లకు లార్డ్స్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

హర్డింగ్‌లీలో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకి ఆలౌట్ కాగా, రోజర్ బిన్నీ 5/40 ధాటికి ఇంగ్లాండ్ 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ సెంచరీ చేయడంతో 237 పరుగులు చేసింది. 

407 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 279 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా... మూడు టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు...

చివరిసారిగా 2007లో ఇంగ్లాండ్‌ను వారి గడ్డమీదే ఓడించి టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది టీమిండియా. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో టీమిండియా 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది. ఈ సిరీస్‌లో దినేశ్ కార్తీక్ టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.

లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ముందు 380 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది ఇంగ్లాండ్. దినేశ్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ హాఫ్ సెంచరీలతో రాణించి, టీమిండియాను ఓటమి నుంచి కాపాడారు.

నాటింగ్‌హమ్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకి ఆలౌట్ అయ్యింది. జహీర్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 481 పరుగులు చేయగలిగింది...

టాపార్డర్‌లోని దినేశ్ కార్తీక్, వసీం జాఫర్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ హాఫ్ సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్, కెప్టెన్ మైఖేల్ వాగన్ సెంచరీ చేయడంతో 355 పరుగులు చేసింది. 73 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు, 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది... 

ఓవల్‌లో జరిగిన మూడో టెస్టులో అనిల్ కుంబ్లే సెంచరీ చేయడంతో తొలి ఇన్ినంగ్స్‌లో టీమిండియా 664 పరుగులు చేసింది. ధోనీ 92, సచిన్ టెండూల్కర్ 82, దినేశ్ కార్తీక్ 91 పరుగులు చేశారు... తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 345 పరుగులు చేసింది. 

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 180/6 పరుగుల వద్ల ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా పాల్ కాలింగ్‌వుడ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ టెస్టును డ్రా చేసుకోగలిగింది. ఈ సిరీస్‌లో దినేశ్ కార్తీక్ 263 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జహీర్ ఖాన్ 18 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు.

మళ్లీ 14 ఏళ్లకు ఇప్పుడు సిరీస్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడింది. ఈ రెండు ఓటముల తర్వాత డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌లో జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

click me!