సఫారీలతో అంత ఈజీ కాదు... ధోనీ, విరాట్‌ల వల్ల కానిది, రోహిత్ చేయగలడా...

First Published Sep 26, 2022, 1:26 PM IST

ఐసీసీ టోర్నీల్లో ఎలా ఉన్నా, ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపిస్తుంది. ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్ నుంచే నిష్కమించిన భారత జట్టు, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మరో రెండు రోజుల్లో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా...

Image credit: Getty

టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది సౌతాఫ్రికా క్రికెట్ టీమ్. సెప్టెంబర్ 28, బుధవారం సౌతాఫ్రికా, ఇండియా మధ్య తిరువనంతపురంలో తొలి టీ20 మ్యాచ్ జరగబోతుంటే, ఆ తర్వాత అక్టోబర్ 2న గౌహతీలో రెండు టీ20, అక్టోబర్ 4న ఇండోర్‌లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతాయి...
 

Image credit: PTI

స్వదేశంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై టీ20 సిరీస్‌లు గెలిచిన భారత జట్టు ఇప్పటిదాకా సౌతాఫ్రికాపై మాత్రం టీ20 సిరీస్ నెగ్గలేకపోయింది. ఇంతకుముందు 2015,2019, 2022ల్లో సౌతాఫ్రికా జట్టు, భారత్‌లో పర్యటించింది. 

Image credit: PTI

అంతకుముందు ఇరుజట్ల మధ్య టీ20 మ్యాచులు జరిగినా, ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌లుగానే జరిగాయి తప్ప సిరీస్‌లు జరగలేదు... 2015లో భారత పర్యటనకి వచ్చిన సౌతాఫ్రికా, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టును 2-0 తేడాతో చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. ధర్మశాలలో జరిగిన టీ20లో 7 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడింది..

2018లో సౌతాఫ్రికా టూర్‌లో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో గెలిచిన టీమిండియా, స్వదేశంలో మాత్రం ఆ ఫీట్ రిపీట్ చేయలేకపోయింది. ధర్మశాలలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మొహాలీలో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు.. అయితే బెంగళూరులో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 2-0 తేడాతో సిరీస్ కోల్పోతే, కోహ్లీ కెప్టెన్సీలో సిరీస్ డ్రాగా ముగిసింది..

Rohit Sharma-Steve Smith

ఈ ఏడాది ఆరంభంలో రిషబ్ పంత్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడింది భారత జట్టు. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో సౌతాఫ్రికా గెలిస్తే, ఆ తర్వాత రెండు మ్యాచులు టీమిండియా గెలిచింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది...

Image credit: PTI

సౌతాఫ్రికాపై విరాట్ కోహ్లీ ఓ మ్యాచ్ గెలిస్తే, రిషబ్ పంత్ రెండు టీ20లు గెలిచాడు. స్వదేశంలో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మకు అరుదైన అవకాశం దొరికింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముందు సఫారీలపై సిరీస్ గెలిస్తే ఆ విజయం ఇచ్చే ఊపుతో రెట్టింపు ఉత్సాహంతో ఆస్ట్రేలియా విమానం ఎక్కుతుంది రోహిత్ సేన..

click me!