అక్కడ విఫలం కావడం మమ్మల్ని భయపెడుతున్నది.. ప్రపంచకప్‌ కు ముందు ఇది మంచిది కాదు : రోహిత్ షాకింగ్ కామెంట్స్

First Published Sep 26, 2022, 12:15 PM IST

IND vs AUS T20I: టీ20 ప్రపంచకప్ కు ముందు ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్ ద్వారా భారత బలహీనతలు స్పష్టంగా బయిటపడ్డాయి.  ఈ సిరీస్ తర్వాత టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

గడిచిన  నెల రోజులుగా భారత క్రికెట్ అభిమానులతో పాటు జట్టును కూడా అత్యంత కలవరపెడుతున్న విభాగం  టీమిండియా బౌలింగ్. మరీ ముఖ్యంగా ఆసియా కప్ నుంచి భారత బౌలింగ్ నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. ఆ మెగా టోర్నీలో భారత్ ఓడటానికి కారణం పేలవ బౌలింగే అన్నది   అందరికీ తెలిసిందే. 
 

ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా మన బౌలర్లు  విఫలమయ్యారు. ఒక్క అక్షర్ పటేల్ మినహా మిగిలిన బౌలింగ్ దళమంతా విఫలమైంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్,  స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తో పాటు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్  తీవ్రంగా నిరాశపరిచారు. 

అయితే పవర్ ప్లే లోనే భారీగా పరుగులిచ్చుకుంటున్న బౌలర్లు.. మిడిల్ ఓవర్లలో కాస్త కట్టడి చేస్తున్నారు. కానీ డెత్ ఓవర్లలో మాత్రం ధారాళంగా పరగులిస్తున్నారు. ఈ పేలవ ప్రదర్శన వల్లే ఆస్ట్రేలియాతో మొహాలీలో ముగిసిన తొలి మ్యాచ్ లో భారత్.. 208 పరుగుల భారీ స్కోరు చేసినా మ్యాచ్ ఓడాల్సి వచ్చింది.

మొహాలీలో ఆసీస్ చివరి 20 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి ఉండగా భువనేశ్వర్, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు.  నాగ్‌పూర్ లో కూడా చివరి 3 ఓవర్ల (8 ఓవర్ల మ్యాచ్) లో 44 పరుగులు వచ్చాయి. హైదరాబాద్ మ్యాచ్ లో  ఆఖరి మూడు ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకుంది.
 

హైదరాబాద్ లో మ్యాచ్ ముగిశాక రోహిత్ కూడా ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేశాడు.  డెత్ ఓవర్లలో తమ బౌలర్లు దారుణంగా విఫలమవుతున్నారని,  సౌతాఫ్రికాతో పాటు ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆ లోపాలు సరిదిద్దుకుంటామని అన్నాడు. 
 

ప్రజెంటేషన్ లో మురళీ కార్తీక్.. ‘ఈ సిరీస్ ద్వారా మీరు ఎక్కడైనా లోపాలున్నట్టు గుర్తించారా..? ఉంటే ఏంటవి..?’ అని ప్రశ్నించాడు. దానికి  రోహిత్ సమాధానమిస్తూ.. ‘అవును. చాలా ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్. అక్కడ మేం  దారుణంగా విఫలమవుతున్నాం. అయితే బుమ్రా, హర్షల్ లు రెండు నెలల తర్వాత ఇప్పుడే జట్టులోకి తిరిగొచ్చారు. 
 

ప్రపంచకప్ కు ముందు ప్రధాన బౌలర్లు ఇలా విఫలమవడం జట్టుకు కూడా మంచిది కాదు. కానీ గాయం నుంచి కోలుకుని  బౌలింగ్ చేయడమనేది మాములు విషయం కాదు.అయితే వాళ్లింకా కోలుకోవాలి. దక్షిణాఫ్రికా సిరీస్ లో  వాళ్లిద్దరూ పూర్తిస్థాయిలో రాణిస్తారని ఆశిస్తున్నాం. .’ అని తెలిపాడు. 

click me!