బంగ్లాదేశ్‌పై మ్యాచ్ ఓడిపోండి ఫస్టు... టీమిండియా సెమీస్ ఓటమితో తెరపైకి కొత్త సెంటిమెంట్...

First Published | Nov 14, 2022, 5:28 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్‌లో ఓడింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 2014 టీ20 వరల్డ్ కప్, 2015 వన్డే వరల్డ్ కప్, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో టైటిల్ గెలవలేకపోయిన భారత జట్టు, 2022 టోర్నీలోనూ నిరాశపరిచింది... దీంతో ఓ కొత్త సెంటిమెంట్‌ తెరపైకి వచ్చింది...

2022 టీ20 వరల్డ్ కప్ టైటిల్ దక్కించుకున్న ఇంగ్లాండ్, వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ టైటిల్స్‌ని ఒకేసారి దక్కించుకున్న జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. 2019 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్, 2022 టీ20 వరల్డ్ కప్‌ని గెలుచుకుంది... ఇంగ్లాండ్ విజయాలకు బంగ్లాదేశ్‌‌యే కారణమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓడింది ఇంగ్లాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 275 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో 260 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్.. ఈ పరాజయం తర్వాత ఇంగ్లాండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది...


2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఇంగ్లాండ్, 2021 టీ20 వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీ ఫైనల్ చేరింది. 2019లో మొట్టమొదటిసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది ఇంగ్లాండ్... 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సెమీస్ చేరింది ఇంగ్లాండ్.

ఇంగ్లాండ్ మాత్రమే కాదు, టీమిండియా విషయంలోనూ ఈ బంగ్లా సెంటిమెంట్‌ భలేగా వర్కవుట్ అయ్యింది. 2007 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని అందుకుంది భారత జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 191 పరుగులకి ఆలౌట్ కాగా ఈ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది బంగ్లా...

భారత క్రికెట్ చరిత్రలో ఈ పరాజయం సంచలన మార్పులు తీసుకొచ్చింది. భారత క్రికెటర్ల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఈ పరిణామాలతో 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనడానికి సీనియర్లు ఇష్టపడలేదు. కొత్త కుర్రాళ్లతో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ గెలిచింది టీమిండియా...

ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టు, టెస్టుల్లోనూ నెం.1 ర్యాంకును సాధించింది. 2007 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లా చేతుల్లో ఓడిన తర్వాత టీమిండియాకి స్వర్ణ దశ తిరిగింది. అందుకే మళ్లీ మరోసారి బంగ్లాతో మ్యాచ్ ఓడిపోవాలని గట్టిగా కోరుకుంటున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్...

Latest Videos

click me!