టీమిండియా మాజీ క్రికెటర్ కు ప్రాణ హాని.. చంపేస్తామని బెదిరింపులు.. వార్నింగ్ ఇచ్చింది వాళ్లే..

First Published Nov 24, 2021, 1:43 PM IST

Gautam Gambhir: సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు సేవలందించి ప్రస్తుతం కేంద్రంలో ఉన్న అధికార  పార్టీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ ను చంపేస్తామని ముష్కరులు బెదిరింపులకు దిగారు. 

టీమిండియా మాజీ  క్రికెటర్, ఈశాన్య ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ ను చంపేస్తామని బెదిరింపు  కాల్స్ వచ్చాయి.  కాశ్మీర్ కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థ నుంచి అతడికి కాల్స్ వచ్చినట్టు సమాచారం. 

ఇదే విషయమై గంభీర్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఐసిస్ కాశ్మీర్  నుంచి గంభీర్ కు  ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు పోలీసులకు తెలిపాడు.

మెయిల్ లో గంభీర్ తో పాటు  అతడి కుటుంబసభ్యులనూ చంపుతామని  ఉగ్రవాదులు పేర్కొన్నట్టు ఈ మాజీ క్రికెటర్ పోలీసులకు తెలిపాడు. అయితే ఇది దీనిపై విచారణ జరిపిస్తున్నట్టు సెంట్రల్ డిస్ట్రిక్ట్ డీసీపీ గౌరవ్ అరోరా తెలిపారు. 

గంభీర్  ఫిర్యాదు తర్వాత అతడి ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అరోరా పేర్కొన్నారు. గంభీర్.. ఈశాన్య ఢిల్లీలోని  రాజేంద్రనగర్ ఏరియాలో ఉంటున్నాడు.  

ఇదే విషయమై గౌరవ్ అరోరా.. ‘గంభీర్ కు ఐసిస్ కాశ్మీర్ నుంచి  మెయిల్ వచ్చింది. అందులో అతడితో పాటు గంభీర్ కుటుంబాన్ని కూడా చంపేస్తామని ఉగ్రవాదులు బెదిరించారు. దీనిని సీరియస్ ఇష్యూగా తీసుకుని అతడి ఇంటికి భద్రతను పెంచండి..’ అంటూ స్థానిక పీఎస్ కు లేఖ రాశారు. 

2018లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరైన గంభీర్.. 2019లో బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన విషయం  తెలిసిందే. అప్పట్నుంచి ఆయన పలు  అంశాలపై వివాదాస్పదంగా స్పందిస్తూనే ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా గంభీర్ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

పాకిస్తాన్ నుంచి అక్రమంగా చొరబాట్లు చేస్తున్న ఉగ్రవాదంపై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు గుండా టెర్రరిజం ముప్పు ముగిసే వరకూ పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు నెరపాల్సిన అవసరం లేదని ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో పేర్కొన్నారు. ఎందుకంటే సరిహద్దులో పహారా కాస్తున్న భారత సైనికుల ప్రాణాలే అన్నింటి కంటే తమకు ప్రధానమని అన్నారు.

కాగా.. రాజకీయాలు కాకుండా భారత క్రికెట్ కు  నిస్వార్థ సేవలందించిన ఘనత గంభీర్ సొంతం. 2007 టీ20 ప్రపంచకప్ తో పాటు.. 2011 వన్డే వరల్డ్ కప్ లో  భారత్ విజయం సాధించడంలో గంభీర్ పాత్ర చాలా కీలకం. ఆ రెండు టోర్నీలలో గంభీర్ రాణించినా.. మ్యాన్ ఆఫ్ ది టోర్నీ మాత్రం వేరే వాళ్లకు దక్కింది. 

click me!