ఐదో టెస్టుని వెంటాడుతున్న కరోనా... వార్మప్ మ్యాచ్‌కి ముందు టీమిండియాలో పాజిటివ్ కేసులు...

First Published Jun 22, 2022, 1:14 PM IST

గత ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన భారత జట్టు, అప్పుడెప్పుడో ఏడాది క్రితం మొదలెట్టిన టెస్టు సిరీస్‌ని ఇప్పటిదాకా పూర్తి చేయలేదు. షెడ్యూల్ ప్రకారం మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్, టీమిండియాలో కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడంది. ఏడాది తర్వాత రీషెడ్యూల్ చేస్తే, ఇప్పుడు కూడా టీమిండియాని కరోనా వదలడం లేదు...

ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు సమయంలోనే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ కరోనా పాజిటివ్‌గా తేలారు. ఐదో టెస్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో ఉండగా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మర్‌కి కూడా పాజిటివ్ రావడంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా పాల్గొనలేకపోయింది...

ఐదో టెస్టు ఆరంభానికి ముందురోజు భారత క్రికెటర్లకు రెండు విడతల కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో క్రికెటర్లందరికీ నెగిటివ్ రిజల్ట్ రావడంతో ఐదో టెస్టు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగుతుందని భావించారంతా...

అయితే ఐదో టెస్టు ప్రారంభానికి ముందు కొందరు క్రికెటర్లు, కరోనా భయంతో మ్యాచ్ ఆడడానికి అంగీకరించలేదు... ప్రాక్టీస్ సెషన్స్‌తో తమతో ఉన్న యోగేశ్‌కి పాజిటివ్ సోకడంతో కొంతమంది ప్లేయర్లు, మ్యాచ్ ఆడడానికి భయపడడంతో అప్పటికప్పుడు మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు... 

Image credit: BCCI

సెప్టెంబర్ 10, 2021న మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు కాస్తా, ఈ ఏడాది జూలై 1న బెర్మింగ్‌హమ్ వేదికగా నిర్వహించాలని భావిస్తున్నాయి ఇరు జట్లు... ఐదో టెస్టుకి ముందు లంకాషైర్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియాను మరోసారి పలకరించింది కరోనా...

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, కరోనాతో స్వదేశంలోనే ఉండిపోగా, మాల్దీవుల్లో హాలీడేస్ గడిపి టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్ చేరిన భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ... కరోనా బారిన పడి కోలుకున్నట్టు వార్తలు వస్తున్నాయి...

విరాట్ కోహ్లీతో కలిసి సన్నిహితంగా మెలిగిన మరికొందరు క్రికెటర్లు కూడా కరోనా బారిన పడ్డారని, వీరంతా లంకాషైర్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌లో పాల్గొనడం కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి...

చూస్తుంటే ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరగాల్సిన ఐదో టెస్టుకి కరోనా గండం పొంచి ఉన్నట్టు కనిపిస్తుందని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్... ఈసారి అయినా ఐదో టెస్టు సజావుగా పూర్తవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. 

click me!