బంగారపు హుండీని చిల్లర వేసేందుకు వాడుతున్నారు... ఉమ్రాన్ మాలిక్ అదిరే ఎంట్రీతో...

First Published Nov 25, 2022, 1:05 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ఫ్లాప్‌తో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే అదే ఏడాదిలో భారత జట్టుకి ఓ ఆణిముత్యాన్ని అందించింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో నటరాజన్ కరోనా బారినపడడంతో అనుకోకుండా జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్, అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన ఉమ్రాన్ మాలిక్... 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసి అదరగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు ఉమ్రాన్ మాలిక్...

ఈ పర్ఫామెన్స్ కారణంగానే టీమిండియాకి పిలుపునిచ్చారు సెలక్టర్లు. అయితే ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా వాడుకునే ప్రయత్నం చేయలేదు రోహిత్ శర్మ. టీమిండియా తరుపున 3 టీ20 మ్యాచులు ఆడిన ఉమ్రాన్ మాలిక్, వేసింది 9 ఓవర్లే. అంటే ఒక్క మ్యాచ్‌లో కూడా పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు ఉమ్రాన్ మాలిక్...

Image credit: Getty

గంటకు 140-150 కి.మీ.ల వేగంతో నిప్పులు చెదిరే బంతులు సంధిస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపించే ఉమ్రాన్ మాలిక్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఉండి ఉంటే... రిజల్ట్ వేరేలా ఉండేది. అయితే సెలక్టర్లు కానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌ కానీ ఉమ్రాన్ మాలిక్‌ని వాడుకోవడానికి ఆసక్తి చూపించలేదు...

Image credit: Getty

తాజాగా భువనేశ్వర్ కుమార్‌కి రెస్ట్ ఇవ్వడం, దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్‌కి చోటు దక్కింది. తొలి వన్డేలో అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం చేసిన ఉమ్రాన్ మాలిక్, మొదటి మ్యాచ్‌లోనే మంచి పర్ఫామెన్స్‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు...

మొదటి వన్డేలో వేసిన తొలి ఓవర్ తొలి బంతికే 145.9 కి.మీ.ల వేగాన్ని అందుకున్న ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాతి బంతికి 143.3 కి.మీ, 145.6 కి.మీ, 147.3 కి.మీ, 137.1 కి.మీ, 149.6 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి బ్యాటర్లను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 153.1 వేగాన్ని కూడా అందుకున్నాడు ఉమ్రాన్ మాలిక్...

Image credit: PTI

24 పరుగులు చేసిన డివాన్ కాన్వేని అవుట్ చేసిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాతి ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. 11 పరుగులు చేసిన డార్ల్ మిచెల్ కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 145+ యావరేజ్ స్పీడ్‌తో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్‌కి టీ20 వరల్డ్ కప్‌లో చోటు ఇవ్వకుండా తప్పు చేశారని అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...
 

ఐపీఎల్‌లో సెన్సేషనల్ ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా ఉమ్రాన్ మాలిక్ ఏం చేయగలడో రోహిత్ శర్మ అండ్ కో తెలుసుకోలేకపోయిందని... టీమ్‌లో బంగారపు హుండీలాంటి ప్లేయర్ ఉన్నా, అతన్ని చిల్లర వేయడానికి వాడుకున్నట్టుగా ద్వైపాక్షిక సిరీస్‌లకే పరిమితం చేశారని అంటున్నారు అభిమానులు... 

click me!