మ్యాచ్ విన్నర్‌ను కోల్పోతున్న టీమిండియా

First Published | Oct 27, 2024, 10:49 PM IST

Border Gavaskar Trophy IND vs AUS : ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. నవంబర్‌లో చీలమండ గాయం కారణంగా షమీ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుండి క్రికెట్ యాక్షన్‌కు దూరమయ్యాడు.
 

Mohammed Shami-Jasprit Bumrah

IND vs AUS: భారత్ - ఆస్ట్రేలియా మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నవంబర్ 22 నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం టీమిండియా జట్టును ప్రకటించారు. అయితే, టీమిండియా ఒక స్టార్ ప్లేయ‌ర్ ను కోల్పోయింది. ప్రస్తుతం జ‌రుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ తో భార‌త్ రెండు మ్యాచ్ ల‌ను ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. ఈ సిరీస్ లో చివ‌రి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. 

Mohammed Shami

అయితే, ఆస్ట్రేలియా కోచ్ టీమిండియాకు సంబంధించి పెద్ద ప్రకటన చేశాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ఐదు మ్యాచ్ ల‌ సిరీస్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌ను కోల్పోబోతున్నామని చెప్పాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత్ మహ్మద్ షమీని చాలా మిస్ అవుతుందని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ స్థానంలో వచ్చే ఫాస్ట్ బౌలర్లను తమ జట్టు తక్కువ అంచనా వేయలేమ‌ని కూడా పేర్కొన్నాడు.

భారత జట్టుకు దూర‌మైన ష‌మీ

పూర్తిగా ఫిట్ గా లేకపోవడంతో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో చేర్చలేదు. 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విజయంలో షమీ కీలక పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అయితే, చీలమండ గాయం కారణంగా గతేడాది నవంబర్‌లో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ నుంచి అతడు ఆడలేదు.


Mohammed Shami

అతనికి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. దీని తర్వాత అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నిపుణుల ప‌ర్య‌వేక్షణ‌లో ఉన్నాడు. ఇటీవల అతని మోకాళ్లు వాపుకు గురయ్యాయి. ఇది అతని పూర్తి ఫిట్‌నెస్‌ను పొందే ప్రక్రియను ప్రభావితం చేసింది. ఈ నేప‌థ్యంలోనే షమీని భార‌త జ‌ట్టులోకి తీసుకోలేదు. 

ఆస్ట్రేలియా కోచ్ మెక్ డొనాల్డ్ ఏమ‌న్నారంటే? 

ఈఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన ఆస్ట్రేలియాన్ కోచ్ మెక్‌డొనాల్డ్.. 'మహ్మద్ షమీ లేకపోవడం భార‌త జ‌ట్టుకు పెద్ద దెబ్బ‌. మన బ్యాట్స్‌మెన్ అతని అభిరుచి, అతని లైన్ అండ్ లెంగ్త్, అతని పని పట్ల అతని అంకితభావం గురించి మాట్లాడే విధానం  క్రీడ‌లో అత‌ని నైపుణ్యానికి నిద‌ర్శ‌నం. దీనిని పరిగణనలోకి తీసుకుంటే అత‌ని విలువైన సేవ‌ల‌ను టీమిండియా కోల్పోతుందని' చెప్పాడు. 

Mohammed Shami , shami

భార‌త జ‌ట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లు వీరే

స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ లేక‌పోవ‌డంతో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, ఆంధ్రా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిలకు భారత్ తొలిసారి అవకాశం ఇచ్చింది. వీరితో పాటు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఎంపికయ్యారు. జస్ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి బాధ్యతలు చేపట్టనున్నాడు.

వారిని తక్కువ అంచనా వేయలేము :  మెక్ డొనాల్డ్ 

ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ.. 'చివరిసారి ఏమి జరిగిందో మాకు తెలుసు. వారి రిజర్వ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అందువల్ల వారి ఆటగాళ్లను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేమ‌ని' చెప్పారు. అలాగే, ఆయ‌న తన జట్టు ఎంపిక గురించి మాట్లాడుతూ.. 'మేము మా అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తాము. అందులో ఎవరైనా యువ ఆటగాడు ఉంటే, మేము ఆ దిశలో వెళ్తాము. అతనే బెస్ట్ ఆప్షన్ అని సెలక్టర్లు భావిస్తే అతడికి అవకాశం కల్పిస్తామ‌ని చెప్పారు. భార‌త జ‌ట్టులోని ప్ర‌తి ప్లేయ‌ర్ ను మేము త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేమ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

Latest Videos

click me!