తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 80 పరుగులు చేయలేకపోయిన పిచ్ మీద, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చాలా తేలిగ్గా 300+స్కోరు చేసేశారు. ఈజీగా 300+ ఆధిక్యం కూడా దక్కించుకునేలా కనిపిస్తోంది ఇంగ్లాండ్ టీమ్...
లార్డ్స్ టెస్టులో ఊహించని పరాజయం తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కసిగా కమ్‌బ్యాక్ ఇచ్చారు. తొలి రెండు టెస్టుల్లో జో రూట్ ఒక్కడే బ్యాటింగ్‌లో ఒంటరిపోరు చేస్తే... ఈ మ్యాచ్‌లో టాప్ 4 బ్యాట్స్‌మెన్ 50+ స్కోరు చేశారు...
2005లో బంగ్లాదేశ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టు తర్వాత ఇంగ్లాండ్‌లోని టాప్ 4 బ్యాట్స్‌మెన్ 50+ స్కోర్లు చేయడం ఇదే మొదటిసారి. లార్డ్స్ టెస్టు పరాజయం, ఇంగ్లాండ్ జట్టులో తీసుకొచ్చిన మార్పుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ...
ఇప్పటికే భారత జట్టుపై భారీ ఆధిక్యం దక్కించుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఇంకా ఇంగ్లాండ్ చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్ వరకూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేయగలరు...
ఎలా చూసుకున్నా కనీసం ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 350- 400+ ఆధిక్యం దక్కేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడినట్టు భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరును దాటించి పరుగులు చేసి... మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది.
ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతూ వరుస వికెట్లు తీసిన చోట భారత బౌలర్లు వికెట్లు తీయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవాలంటే రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి...
మొదటిది రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. భారీ స్కోరు అంటే అలా ఇలా కాదు. సెహ్వాగ్, సచిన్, ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలు ఉన్న సమయంలోలా కనీసం 500+ పరుగులు రావాలి...
అయితే ఈ మధ్యకాలంలో భారత జట్టు 400+ మార్కును కూడా అందుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఓపెనర్లు, లేదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించినా 300+ పరుగులు చేయడమే మహా కష్టంగా మారిపోయింది...
భారీ ఇన్నింగ్స్‌లు నిర్మించగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే... ఇప్పుడు ఘోరంగా విఫలమవుతూ, పేలవ ఫామ్‌లో ఉన్నారు. ఇలాంటి సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు అద్భుతంగా రాణించినా 300+ నుంచి 350 వరకే స్కోరు చేయగలదు...
అదే జరిగితే టీమిండియాకి ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయం తప్పదు. ఈ ఓటమి నుంచి తప్పించాలంటే, తొలి టెస్టులో భారత జట్టుకి విజయాన్ని దూరం చేసిన వరుణుడు, మ్యాచ్‌కి అడ్డంకి కలిగించాలని కోరుకోవాల్సిందే...
టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా మొదటి రోజు రెండో సెషన్‌లోనే బ్యాటింగ్‌కి వచ్చింది ఇంగ్లాండ్. రెండో రోజు మొత్తం ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొనసాగినా... మూడో రోజు రెండో సెషన్‌లో టీమిండియాకి బ్యాటింగ్ రావచ్చు...
ఇప్పుడున్న ఫామ్‌లో టీమిండియాను ఆలౌట్ చేసేందుకు ఇంగ్లాండ్‌కి మహా అయితే మూడు సెషన్లు సరిపోతాయి. అంటే మ్యాచ్ సజావుగా సాగితే నాలుగో రోజు ముగిసిపోతుంది.
అలా జరగకుండా ఉండాలంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమై అయినా వర్షం కారణంగా మరోసారి రోజు లేదా రోజున్నర ఆట రద్దు కావాలని గట్టిగా కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...