నేను అంపైర్ వల్లే అవుట్ అయ్యా, అతనలా చెప్పకపోతే... రిషబ్ పంత్ సంచలన కామెంట్స్...

First Published Aug 26, 2021, 7:23 PM IST

టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ, ఆపద్భాంధవుడి పాత్ర పోషించేవాడు. ఇప్పుడా పొజిషన్‌ను యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తీసుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ టూర్‌లో మాత్రం రిషబ్ పంత్ తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

హెడ్డింగ్‌లీ టెస్టులో 9 బంతులు ఆడిన రిషబ్ పంత్, 2 పరుగులు మాత్రమే చేసి ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వడం కూడా టీమిండియా స్వల్ప స్కోరుకే ఆలౌట్ కావడం కారణమైంది...

రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి 58/5 పరుగుల వద్ద ఉన్న టీమిండియా, ఆ తర్వాత 67 పరుగుల వద్ద నాలుగు వరుస వికెట్లు కోల్పోయి 67/9 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది... ఆఖరి వికెట్‌కి 11 పరుగుల భాగస్వామ్యం రావడంతో 78 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

స్వదేశంలో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో భారత జట్టు తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 25 పరుగులు చేసిన రిషబ్ పంత్, లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు...  

మొదటి ఇన్నింగ్స్‌ తర్వాత మీడియాతో మాట్లాడిన రిషబ్ పంత్, తాను అవుట్ కావడానికి అంపైరేనంటూ సంచలన ఆరోపణలు చేశాడు... ‘నేను క్రీజుకి కొద్దిగా బయట నిలబడి బ్యాటింగ్ చేయాలని అనుకున్నా...

అయితే నేను అలా నిలబడినప్పుడు నా ముందు కాలు, డేంజర్ ఏరియాలో ఉందని చెప్పిన అంపైర్, నన్ను అక్కడ నిల్చోకూడదని చెప్పాడు. ఓ రకంగా బలవంతంగా నా బ్యాటింగ్ పొజిషన్‌ మార్చాడు...

అంపైర్ చెప్పడంతో నేను ఏమీ ఆలోచించకుండా బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చుకున్నాను. ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యా... అయితే ప్రతీ బ్యాట్స్‌మెన్‌కి క్రీజు నుంచి ముందుకొచ్చి బ్యాటింగ్ చేసే సదుపాయం ఉంటుంది. అందులో ఎలాంటి తప్పూ లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్...

‘ప్రతీ క్రికెటర్‌కి రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి జట్టుకోసం ఆలోచించి, అవసరమైన చోట బ్యాటింగ్ చేయడం. మరోటి వ్యక్తిగత ప్రదర్శనకు విలువ నిచ్చి, అనువైన పొజిషన్‌లో బ్యాటింగ్ చేయడం... నేనెప్పుడూ మొదటి దానినే ఎంచుకుంటాను...

జట్టులో ఉన్నప్పుడు, టీమ్‌కి ఏది అవసరమో దాన్ని చేయడానికి ప్రతీ ప్లేయర్ సిద్ధంగా ఉండాలి. జట్టు పర్ఫామెన్స్ కంటే వ్యక్తిగత పర్ఫామెన్స్‌ ముఖ్యమేమీ కాదు. వ్యక్తిగత విషయాలు ముఖ్యమే కానీ భారత జట్టులో మాకందరికీ టీమే ముఖ్యం...’ అంటూ కామెంట్ చేశాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్...

click me!