ఆ విషయంలో విరాట్ కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ... కెప్టెన్సీకి ముందు ‘హిట్ మ్యాన్’ ఖాతాలో...

First Published Nov 8, 2021, 10:58 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత కథ ముగిసింది. మొదటి రెండు కీలక మ్యాచుల్లో విఫలమైన బౌలర్లు, బ్యాట్స్‌మెన్... ఆ తర్వాత పసికూనలపై వరుసగా మూడు మ్యాచుల్లో ప్రతాపం చూపించడంతో హ్యాట్రిక్ విజయాలతో టోర్నీని ముగించింది విరాట్ సేన...

సూపర్ 12 రౌండ్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో నమీబియా విధించిన 133 పరుగుల లక్ష్యఛేదనలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ, తన ఇన్నింగ్స్ ద్వారా కొన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు...

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరి మధ్య ఇది 11వ 50+ భాగస్వామ్యం.రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కలిసి 11 సార్లు 50+ భాగస్వామ్యం నెలకొల్పగా, కెఎల్ రాహుల్, రోహిత్ జోడీ ఈ రికార్డును సమం చేశారు. 

రోహిత్ శర్మ 3 వేల టీ20 పరుగులను పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, మార్టిన్ గుప్టిల్ తర్వాత 3వేల టీ20 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో 3వేలకు పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ. ఇంతకుముందు విరాట్ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మాట్లలో 3వేలకు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.  

విరాట్ కోహ్లీ 79 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకుంటే, మార్టిన్ గుప్టిల్ 101 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ శర్మ 108 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో 3 సార్లు 50+ భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ జోడి... భారత మాజీ ఓపెనింగ్ జోడి గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ (రెండు సార్లు), గౌతమ్ గంభీర్- రోహిత్ శర్మ (రెండేసి సార్లు) రికార్డును అధిగమించి టాప్‌లో నిలిచారు. 

ఫీల్డింగ్‌లో మూడు క్యాచులు అందుకున్న రోహిత్ శర్మ, ఓవరాల్‌గా టీ20ల్లో 44 క్యాచులతో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ఫీల్డర్‌గా టాప్‌లో నిలిచాడు. సురేష్ రైనా, విరాట్ కోహ్లీ 42 క్యాచులతో రోహిత్ తర్వాతి స్థానంలో నిలిచారు...

2016లో ఆస్ట్రేలియాపై టీ20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని సిక్సర్‌తో అధిగమించిన రోహిత్ శర్మ,  2018లో ఫోర్‌తో 2 వేల మైలురాయిని అందుకున్నాడు. తాజాగా డేవిడ్ వీస్ బౌలింగ్‌లో సిక్సర్‌తో 3 వేల టీ20 పరుగులను అందుకున్న ‘హిట్ మ్యాన్’...

37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ,  టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో 847 పరుగులు పూర్తిచేసుకుని, భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి టాప్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లీ నాలుగు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు ఆడి 845 పరుగులు చేస్తే, రోహిత్ శర్మకి ఇది ఓవరాల్‌గా ఏడో టీ20 వరల్డ్‌కప్...

ఆఫ్ఘాన్, స్కాట్లాండ్, నమీబియాలపై వరుసగా హాఫ్ సెంచరీలు బాదిన భారత ఓపెనర్ కెఎల్ రాహుల్, టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఈ ఫీట్ నమోదుచేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

click me!