మా ఓటమికి అదొక్కటే కారణం, లేదంటేనా... కోచ్‌గా ఆఖరి మ్యాచ్‌కి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యలు...

First Published Nov 8, 2021, 9:18 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, కోచ్‌గా రవిశాస్త్రి శకం ముగియనుంది. 2017 నుంచి నాలుగేళ్లుగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ, తమ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. భారత ప్రధాన కోచ్‌గా ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రవిశాస్త్రి...

‘హెడ్‌కోచ్‌గా నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు టీమిండియాపై నాదైన ముద్ర వేయాలని అనుకున్నా. ఇప్పుడు చూసుకుంటే నేను అనుకున్నది సాధించానని అనిపిస్తుంది...

అవును, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మా పర్ఫామెన్స్ బాగోలేదు. దీనికి ఒకే ఒక్క కారణం విశ్రాంతి... నేను మానసికంగా చాలా అలసిపోయా. నా వయసుకి ఇది సర్వసాధారణం... 

కానీ ప్లేయర్లు మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయారు. ఆరో నెలలుగా బయో బబుల్‌లో ఉండాలంటే ఎలా తట్టుకోగలరు. ఐపీఎల్‌కీ, టీ20 వరల్డ్ కప్ టోర్నీకి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుందని ఆశించాం...

కానీ అలా జరగలేదు. వార్మప్ మ్యాచులు, ఆ వెంటనే కీలక మ్యాచులు ఉండడంతో ఒత్తిడిని తట్టుకుని, పరిస్థితులకు అలవాటు పడడానికి ప్లేయర్లకు చాలా సమయం పట్టింది...

మేం ఎప్పుడూ ఓటమికి భయపడలేదు. ఓడిపోయామని సాకులు చెప్పడం లేదు. ప్రతీ ఒక్కరూ మ్యాచ్ గెలవాలనే అనుకుంటారు. కానీ ప్రతీసారి అనుకున్న ఫలితం రాదు. అయితే ఈసారి మాలో గెలవాలనే కసి కూడా మిస్ అయ్యింది...

రాహుల్ ద్రావిడ్, నీ కోసం ఓ గొప్ప జట్టు ఎదురుచూస్తోంది. రాహుల్ ద్రావిడ్ అనుభవం, ఆయన క్రికెట్ ప్రతిభ జట్టుకి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా...  సమయం వచ్చినప్పుడు భారత జట్టుని మరింత రాటుతేలేలా చేయగలడు...

భారత జట్టులో ఉన్న చాలామంది ప్లేయర్లు ఇంకో నాలుగైళ్లు ఆడగలరు. వారిని సరిగా వాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం... రాత్రికి రాత్రి కూడా జట్టులో సమూలమైన మార్పులు చేయడం కుదరదు...

టీమిండియా ఈ స్థాయికి రావడానికి చాలా టైం పట్టింది, దాని వెనక చాలా కృషి కూడా ఉంది. విరాట్ కోహ్లీ ఇంకా జట్టులో ఉన్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ జట్టుకి చాలా విలువైన ప్లేయర్...

టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ది బెస్ట్ అంబాసిడర్. భారత జట్టును పటిష్టం చేయడంలో విరాట్ కోహ్లీ పడిన కష్టం చాలా ఉంది. కోహ్లీ కసిగా ఆడే ఆటగాళ్లను వెతికి పట్టుకుని, జట్టును తయారుచేశాడు...

మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా చాలా బాగా ఆడింది. అయితే టెస్టుల్లో దక్కిన విజయాలు నాకు కోచ్‌గా చాలా సంతృప్తిని ఇచ్చాయి. వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో టెస్టు సిరీస్‌లు గెలిచాం...

ఇంగ్లాండ్‌ టూర్‌లో కూడా ఆధిక్యంలో ఉన్నాం. వచ్చే ఏడాది జరిగే టెస్టుతో సిరీస్ ఫలితం ఏంటనేది తేలుతుంది. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్‌లను టెస్టుల్లో, వన్డే, టీ20ల్లో ఓడించడం అంత ఈజీ కాదు... జట్టుగా మేం దాన్ని సాధించాం...

స్వదేశంలో మాత్రమే పులులుగా ఉన్న టీమిండియా, విదేశాల్లో కూడా విజయాలు సాధించగలదంటూ నిరూపించగలిగాం... జట్టు విజయానికి ఏం కావాలో ఆ సరుకులను ఏరికోరి అమర్చుకున్నాం...

ఈ టోర్నీలో మేం టైటిల్ గెలవలేకపోవచ్చు, అయినంత మాత్రాన టీమిండియా గొప్ప టీమ్ కాకుండా పోదు, రెండు మ్యాచులతో మమ్మల్ని తక్కువ చేయలేరు...’ అంటూ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి...

click me!