రోహిత్ శర్మ కంటే అతనికి కెప్టెన్సీ ఇస్తే బెటర్... విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ ఇద్దరి టాలెంట్, అతనిలోనే...

First Published Nov 11, 2021, 2:57 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో భారత టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కెరీర్ ముగిసింది. నాలుగేళ్లలో భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన విరాట్, ఐసీసీ టోర్నీ లేకుండానే టీ20 కెప్టెన్సీ వదలుకున్నాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్ ముగిసిన మూడు రోజుల తర్వాత ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ నుంచి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకోవడం ఖాయమైపోయింది...

34 ఏళ్ల రోహిత్ శర్మ కాకుండా జట్టులో యంగ్ ప్లేయర్లు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లకి టీ20 కెప్టెన్సీ దక్కొచ్చని ప్రచారం జరిగినా బీసీసీఐ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు...

‘రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇచ్చినా, నాకు తెలిసి అతను మరో రెండేళ్లు మాత్రమే కొనసాగుతాడు. 2023 తర్వాత రోహిత్ శర్మ, అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగితే ఆశ్చర్యపోవాల్సిందే...

కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, మరో పదేళ్ల పాటు కెప్టెన్‌ని మార్చాల్సిన అవసరం లేకుండా కొత్త సారథి ఎంపిక జరగాలి... అవును, నేను మాట్లాడేది అతని గురించే... రిషబ్ పంత్..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ అద్బుతంగా రాణించాడు. అందుకే శ్రేయాస్ అయ్యర్‌ రీఎంట్రీ ఇచ్చినా రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది టీమ్ మేనేజ్‌మెంట్..

అతను జట్టును నడిపించిన విధానంలో నాకు ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ కనిపించారు. విరాట్ కోహ్లీలా దూకుడుగా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూనే, కెప్టెన్ కూల్‌ ధోనీలా కామ్‌గా పనికానిచ్చేశాడు...

రోహిత్ శర్మని వద్దని చెప్పడానికి అతని వయసే ప్రధాన కారణం... రోహిత్ శర్మ ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశాడు. అవును, అతనో బ్రిలియెంట్ కెప్టెన్, ఆ విషయం అందరికీ తెలిసిందే...

ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ నడిపించిన విధానం అసాధారణం. అతనో రెడీమేడ్ కెప్టెన్. అయితే రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా చేస్తే అతను మరో పదేళ్ల పాటు జట్టును నడిపించగలడు...

అందుకే టీమిండియా కెప్టెన్‌ రిషబ్ పంత్ అయితేనే బాగుంటుంది... నేను ఆ పొజిషన్‌లో ఉంటే అలాగే చేసేవాడిని...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్...

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ ఫస్టాఫ్‌కి దూరం కావడంతో జట్టులోని సీనియర్లు అజింకా రహానే, స్టీవ్ స్మిత్, రవిచంద్రన్ అశ్విన్‌లను కాదని రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ అప్పగించింది ఢిల్లీ క్యాపిటల్స్...

ముంబై కెప్టెన్‌గా వ్యవహరించిన పృథ్వీషా కూడా కెప్టెన్సీ రేసులో నిలిచినా కెప్టెన్సీ అనుభవం లేని రిషబ్ పంత్, తనకి దక్కిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు...

గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, మొదటి క్వాలిఫైయర్‌లో సీఎస్‌కే చేతుల్లో, ఆ తర్వాత రెండో క్వాలిఫైయర్‌లో కేకేఆర్ చేతుల్లో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది...

click me!