అతన్ని తొలగించారా? లేక రెస్ట్ ఇచ్చారా... హార్ధిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ సెలక్టర్లకు ఆకాశ్ చోప్రా ప్రశ్న...

First Published Nov 10, 2021, 10:47 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హార్ధిక్ పాండ్యా ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నూరు శాతం ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యాని ఎందుకు ఎంపిక చేశారంటూ బీసీసీఐ సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపించారు భారత క్రికెట్ ఫ్యాన్స్...

ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యాను కేవలం మెంటర్ ఎమ్మెస్ ధోనీ రిఫరెన్స్ కారణంగానే టీమిండియాకి సెలక్ట్ చేశారు సెలక్టర్లు...

హార్ధిక్ పాండ్యా స్థానంలో ఐపీఎల్ 2021 సీజన్‌లో అద్భుతంగా రాణించిన వెంకటేశ్ అయ్యర్‌ను ట్రై చేద్దామని భావించారు సెలక్టర్లు.... ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత పాండ్యాను తప్పించాలనుకున్నారు...

అయితే భారత జట్టుకి ఎన్నో మ్యాచుల్లో ఫినిషర్ రోల్ పోషించిన పాండ్యా అనుభవం టీమ్‌కి ఉపయోగపడుతుందని సెలక్టర్లతో వారించాడు ఎమ్మెస్ ధోనీ... ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ ఛీఫ్ సెలక్టర్ బయటపెట్టిన విషయం తెలిసిందే...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయని హార్ధిక్ పాండ్యా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ నుంచి బౌలింగ్ చేయడం మొదలెట్టాడు..

అయితే టీ20 వరల్డ్‌కప్‌లో నాలుగు మ్యాచుల్లోనూ వికెట్ తీయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, నాలుగు ఓవర్లలో 10 ఎకానమీతో 40 పరుగులు సమర్పించాడు... బ్యాటుతో రాణించినా కీలకమైన పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచుల్లో పాండ్యా మెరుపులు కనిపించలేదు...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రాలతో పాటు హార్ధిక్ పాండ్యా పేరు కూడా కనిపించలేదు...

‘ఆరు నెలలుగా నిరంతర క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వడం న్యాయం. వారికి ఈ సమయంలో రెస్ట్ అవసరం...

అయితే హార్ధిక్ పాండ్యా పరిస్థితి ఏంటి? అతను ఏమంత బిజీ క్రికెట్ ఆడాడని విశ్రాంతినిచ్చారు. రెస్ట్ ఇచ్చారా? లేక పర్ఫామెన్స్ బాగోలేదని జట్టు నుంచి తొలగించారా? క్లారిటీ ఇవ్వండి...

ఎందుకంటే అతను టెస్టు క్రికెట్ ఆడడం లేదు. ఐపీఎల్‌లో కూడా బౌలింగ్ చేయలేదు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పెద్దగా చేసిందేం లేదు. ఆఖరి రెండు మ్యాచుల్లో అయితే అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు... ’ అంటూ ప్రశ్నించాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

‘న్యూజిలాండ్‌కి ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లు చాలా ఎక్కువయ్యారు. టీ20ల్లో ఏ ప్లేస్‌కి ఏ ప్లేయర్‌ని అని పక్కాగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. బాగా ఆడుతున్నారని అందర్నీ ఓపెనర్లే ఆడించలేం కదా..

ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా జట్టును ఎంపిక చేయడం మంచిదే. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌ని, ఐదో స్థానంలో ఆడించడం ఓ ప్రణాళిక లోపమే అవుతుంది...

ఓపెనర్‌గా అదరగొట్టిన ప్లేయర్, మిడిల్ ఆర్డర్‌లో సర్దుకోలేదు. మూడు మ్యాచుల సిరీస్‌కి ఐదుగురు ఓపెనర్లు ఎందుకు? నా ఉద్దేశంలో రాహుల్, రోహిత్‌లను ఓ రెండు మ్యాచులు ఆడించి, మూడో మ్యాచ్‌కి రెస్ట్ ఇస్తే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా...

click me!