T20 World cup: కివీస్ తో సెమీస్ పోరుకు ముందు ఇంగ్లాండ్ కు భారీ షాక్.. టోర్నీ నుంచి జేసన్ రాయ్ ఔట్

First Published Nov 8, 2021, 6:26 PM IST

Jason Roy:మరో రెండ్రోజుల్లో ఆ జట్టు న్యూజిలాండ్ తో తొలి సెమీస్ ఆడనుంది. అబుదాబి వేదికగా జరిగే ఈ కీలక మ్యాచ్ కు జేసన్ రాయ్ అందుబాటులో ఉండడు.

టీ20 ప్రపంచకప్ లో అదిరిపోయే ప్రదర్శనతో సెమీఫైనల్స్ కు చేరిన  ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. రెండ్రోజుల్లో న్యూజిలాండ్ తో సెమీస్ పోరులో తలపడనున్న ఆ జట్టుకు ఇది నిజంగా చేదు వార్తే. 

ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు జేసన్ రాయ్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికా తో మ్యాచ్ లో రాయ్ గాయపడ్డ విషయం తెలిసిందే. 

మరో రెండ్రోజుల్లో ఆ జట్టు న్యూజిలాండ్ తో తొలి సెమీస్ ఆడనుంది. అబుదాబి వేదికగా జరిగే ఈ కీలక మ్యాచ్ కు జేసన్ రాయ్ అందుబాటులో ఉండడు. గాయపడిన రాయ్ స్థానంలో.. జేమ్స్ విన్స్  తుదిజట్టుతో చేరనున్నాడు.

ఇదే విషయమై జేసన్ రాయ్ స్పందిస్తూ.. ‘ఇది చాలా బాధాకరమైన వార్త. గాయం కారణంగా నేను ప్రపంచకప్ నుంచి తప్పుకుంటున్నాను. కానీ నేను జట్టుతోనే ఉంటాను. మా జట్టును ఎంకరేజ్ చేస్తాను. మేము ఈసారి కచ్చితంగా కప్పు కొడతాం. ఇప్పటివరకు ఈ ప్రయాణం ఎంతో మధురమైనది’ అని అన్నాడు.  

ఈ టోర్నీలో రాయ్ ఇప్పటివరకు 5 మ్యాచులాడి  123 పరుగులు చేశాడు. 61  అత్యధిక స్కోరు. మొత్తంగా చూస్తే  అంతర్జాతీయ టీ20 లలో రాయ్ 1,316 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్థ సెంచరీలున్నాయి. 

ప్రపంచకప్ లో  ఈనెల 10 న న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరుగనున్న సెమీస్.. ఇరు జట్లకూ కీలకమే.  గ్రూప్-1 నుంచి ఇంగ్లాండ్.. గ్రూప్-2 నుంచి  కివీస్ లు ఈ పోరులో నెగ్గి ఫైనల్స్ కు దూసుకెళ్లాలని భావిస్తున్నాయి. 2019 ప్రపంచకప్ ఫైనల్స్ లో తమను ఓడించిన ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ భావిస్తుండగా.. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ఇంగ్లీష్ జట్టు కోరుకుంటున్నది.

click me!