ఆ రెండింటిపై పగ తీరింది, ఇక మిగిలింది ఆస్ట్రేలియానే... న్యూజిలాండ్ ఈసారి గెలిస్తే...

First Published Nov 14, 2021, 3:45 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది న్యూజిలాండ్. ఏ మాత్రం అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించి, ఫైనల్ చేరిన ఈ రెండు జట్లలో ఏది గెలిచినా... అది చరిత్రే. అయితే కివీస్‌ గెలిస్తే మాత్రం టైటిల్ గెలవడంతో పాటు రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా అవుతుంది...

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో పగలు, ప్రతీకారాలు అనే మాటలకు తావులేదు. అయితే తమను ఓడించిన జట్టుపై విజయం సాధిస్తే, ఆ గెలుపు ఇచ్చే కిక్ వేరే రేంజ్‌లో ఉంటుంది... ఫీల్డ్‌గా కామ్ అండ్ కూల్‌గా కనిపించే కేన్ విలియంసన్, ఈ రివెంజ్ డ్రామాని సైలెంట్‌గా పర్ఫెక్ట్‌గా నడిపిస్తున్నాడు...

2008 అండర్19 వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ జట్టును సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడించి, ఫైనల్ చేరింది భారత జట్టు. అప్పుడు టీమిండియాను నడిపించింది విరాట్ కోహ్లీ అయితే, న్యూజిలాండ్ అండర్19 టీమ్ కెప్టెన్ కేన్ విలియంసన్...

ఈ ఓటమికి 11 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీపై రివెంజ్ తీసుకున్నాడు కేన్ విలియంసన్. 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో గ్రూప్ స్టేజ్‌లో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది...

ఒక దెబ్బ కొడితే, తిరిగి రెండు దెబ్బలు కొట్టాలనే సిద్ధాంతం కేన్ మామది. అందుకే 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో విరాట్ సేనను ఓడించినా, ఆ ఫలితంతో సంతృప్తి చెందిన న్యూజిలాండ్, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టును చిత్తు చేసి టైటిల్ సాధించింది...

21 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత న్యూజిలాండ్ జట్టుకి దక్కిన మొట్టమొదటి ఐసీసీ టైటిల్ ఇది. ఈ విజయాన్ని దాదాపు నెల రోజుల పాటు ఎంజాయ్ చేశారు కేన్ విలియంసన్ అండ్ టీమ్...

2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరినా ఇంగ్లాండ్ చేతుల్లో ఓటమి ఎదుర్కొంది న్యూజిలాండ్. హై డ్రామా మధ్య నడిచిన ఫైనల్ మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడం, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌కి విజయం దక్కింది...

ఈ పరాజయానికి రెండేళ్ల తర్వాత రివెంజ్ తీర్చుకున్నాడు కేన్ విలియంసన్. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది...

టైటిల్ ఫెవరెట్‌గా టోర్నీని ఆరంభించించిన ఇంగ్లాండ్ కంటే, న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు బాది, అన్ని రకాలుగా వన్డే వరల్డ్‌కప్ పరాజయానికి స్వీట్ రివెంజ్ తీర్చుకుంది...

ఇక కేన్ మామ రివెంజ్ లిస్టులో మిగిలింది ఆస్ట్రేలియానే. 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు, ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్, 183 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

ఈ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 33.1 ఓవర్లలో ఆడుతూ పాడుతూ ఛేదించిన ఆసీస్, టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్‌లో కేన్ విలియంసన్ కెప్టెన్ కాకపోయినా, అప్పటి టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు...

అంతేకాకుండా అప్పుడు ఆసీస్ జట్టులో సభ్యులుగా ఉన్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌‌వుడ్ వంటి ప్లేయర్లు ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆడబోతున్నారు. అందుకే ఆసీస్‌ను ఓడిస్తే, కేన్ మామ లెక్క సరిచేసినట్టు అవుతుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!