మూడు ఫార్మాట్స్, మూడు ఫైనల్స్, అన్నింట్లోనూ అతనే... కేన్ మామ కాస్త నీ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పు...

First Published Nov 14, 2021, 5:13 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగింది న్యూజిలాండ్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇండియా... ఆఖరికి పాకిస్తాన్ అయినా టైటిల్ గెలవచ్చు కానీ న్యూజిలాండ్ సెమీస్ చేరితేనే గొప్ప అనుకున్నారంతా. అయితే లీగ్ మొదలయ్యాక సీన్ మారిపోయింది...

పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో పోరాడి ఓడిన న్యూజిలాండ్, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు ఒత్తిడికి గురి కావడంతో కివీస్ సునాయాస విజయం దక్కింది...

నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేసింది న్యూజిలాండ్. ఆఖరి నాలుగు ఓవర్లలో 40 కొట్టినా, పసికూన నమీబియా మీద ఈజీ టార్గెట్ ఉంటుందని భావించారంతా...

అయితే ఆఖరి నాలుగు ఓవర్లలో 67 పరుగులు రాబట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్, మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేశారు. ఇదే న్యూజిలాండ్ అసలు సిసలైన సక్సెస్ సీక్రెట్...

నమీబియా చిన్నజట్టు కాబట్టి, పెద్దగా అనుభవం లేని బౌలింగ్ యూనిట్ కాబట్టి న్యూజిలాండ్ భారీ స్కోరు చేయగలిగింది అనుకుంటే పొరపాటే. ఎంత చిన్న జట్టు అయినా నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడం కష్టమే...

వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలుదొక్కుకోలేరు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి, బౌండరీలు బాదడమే వారి ఆట స్ట్రైల్. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించి, తమ సహజసిద్ధమైన బ్యాటింగ్ స్టైల్‌ని వదులుకోలేక తెగ ఇబ్బంది పడింది వెస్టిండీస్...

న్యూజిలాండ్ ఆ తప్పు చేయలేదు. వెస్టిండీస్, ఇంగ్లాండ్‌ల మాదిరిగా న్యూజిలాండ్ మొదటి ఓవర్ నుంచి బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని ఆలోచించదు. పరిస్థితులకు తగ్గట్టు తమ బ్యాటింగ్ స్టైల్‌కి మార్చుకోవడం వారికి అలవాటు...

ఇదే సక్సెస్ సీక్రెట్‌తో గత మూడు ఐసీసీ టోర్నీల్లోనూ ఫైనల్‌ చేరింది న్యూజిలాండ్. 2015 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన న్యూజిలాండ్, కేన్ విలియంసన్ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కి అర్హత సాధించింది...

వారి చేతుల్లోని లేని వివిధ గణాంకాల కారణంగా వన్డే వరల్డ్‌కప్ టైటిల్ గెలవలేకపోయింది కానీ ఫైనల్‌లో కివీస్ చూపించిన ఆటతీరు, ఛాంపియన్ టీమ్‌కి ఏ మాత్రం తక్కువ కాదు. కొంచెం లక్ తోడై ఉంటే, కేన్ మామ వన్డే వరల్డ్‌కప్ అందుకునేవాడే...

వన్డే ఫార్మాట్‌లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్, టెస్టు ఫార్మాట్‌లో నిర్వహించిన ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియాను ఓడించి, 21 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ అందుకుంది...

వాతావరణ పరిస్థితులు, పిచ్, ఇంకా అనేక అంశాలు న్యూజిలాండ్‌కి కలిసి వచ్చాయి. అయినా ఆ పరిస్థితులను వాడుకుంటూ న్యూజిలాండ్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వగలిగింది. అందుకే టైటిల్ సాధించింది.

ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలోనూ ఫైనల్ చేరింది. ఐసీసీ మూడు ఫార్మాట్లలో నిర్వహించిన ఆఖరి మూడు ఫైనల్స్‌లోనూ మూడు విభిన్నమైన ప్రత్యర్థులతో తలబడింది న్యూజిలాండ్...

2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో, 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌తో తలబడిన కేన్ మామ టీమ్, 2021 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలబడనుంది...

ఫార్మాట్లకి అతీతంగా ఇంత నిలకడగా ఐసీసీ టోర్నీల్లో ఓ జట్టును విజయవంతంగా ఫైనల్స్‌కి నడిపించిన కెప్టెన్ గతంలో ఎవ్వరూ లేరు. ఎమ్మెస్ ధోనీ 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ టోర్నీ గెలిచినా... మధ్యలో రెండు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది...

అయితే టైటిల్ గెలవకుండా ఎన్ని ఫైనల్స్‌ ఆడినా, ఆ టీమ్, ఆ కెప్టెన్ సక్సెస్‌ఫుల్ కాలేరు. ఫైనల్‌లో గెలిచిన జట్టునే విజేతగా ప్రకటించారు. కేన్ విలియంసన్ ఆ మార్జిన్‌ని దాటి, ఆల్‌గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా తన పేరు లిఖించుకుంటాడో లేదో చూడాలి...

click me!