ద్రావిడ్‌ను టీమిండియా కోచ్‌గా చేయడానికి కారణమదే.. షాకింగ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ బాస్

First Published Nov 14, 2021, 5:09 PM IST

Sourav Ganguly: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఇటీవలే రాహుల్ ద్రావిడ్ నియమితుడయ్యాడు. ఈ పదవి కోసం పలువురు స్వదేశీ, విదేశీ మాజీ ఆటగాళ్లు పోటి పడినా బీసీసీఐ చీఫ్ గంగూలీ మాత్రం పట్టుబట్టి మరీ ద్రావిడ్ ను తీసుకొచ్చాడు. 

టీమిండియాకు హెడ్ కోచ్ గా ఎంపికైనా రాహుల్ ద్రావిడ్.. ముందు ఆ బాధ్యతలు చేపట్టడానికి ససేమిరా అన్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) చీఫ్ గా ఉన్న ద్రావిడ్.. ఆ బాధ్యతల్లోనే కొనసాగాలని నిశ్చయించుకున్నా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పట్టుబట్టి మరీ ద్రావిడ్ ను టీమిండియా కోచ్ పదవికి తీసుకొచ్చాడు. 

అయితే రవిశాస్త్రి తర్వాత కొత్త కోచ్ కోసం వెతుకుతున్న బీసీసీఐ కి  స్వదేశం నుంచే గాక విదేశాల నుంచి  పలు ప్రతిపాదనలు వచ్చినా కాదని గంగూలీ అండ్ కో రాహుల్ వైపే మొగ్గు చూపింది. మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరున్న ‘ది వాల్’.. ఎన్సీఎ లో యువ భారత క్రికెటర్లను సానబెట్టడాన్ని వదిలి టీమిండియా కు హెడ్ కోచ్ గా రావడానికి గల కారణాలను గంగూలీ వివరించాడు.

షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో పాల్గొన్న దాదా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘కొద్ది రోజుల క్రితం నాకు రాహుల్ ద్రావిడ్ కొడుకు (ద్రావిడ్ కు ఇద్దరు కొడుకులు.. సమిత్, అన్వయ్) నుంచి ఫోన్ వచ్చింది.  కాల్ లో అతడు.. మా నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. ఇక్కడ్నుంచి తీసుకుపోమ్మని చెప్పాడు.

దాంతో నేను వెంటనే ద్రావిడ్ కు ఫోన్ చేసి నువ్వు జాతీయ జట్టుతో చేరే సమయం ఆసన్నమైందని చెప్పాను..’ అంటూ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ద్రావిడ్ తో తన స్నేహం ఇప్పటిది కాదని, ఇద్దరం కలిసే పెరిగామని  గుర్తు చేశాడు. 

‘మేమిద్దరం కలిసే  పెరిగాం. దాదాపు ఇద్దరమూ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. కలిసి చాలా కాలం పాటు భారత్ కు ప్రాతినిథ్యం వహించాం. కావున మాలో కొందరికి అతడిని జాతీయ జట్టుకు కోచ్ గా రమ్మని  స్వాగతించడం సులభమైంది..’ అని దాదా చెప్పాడు.

ఇక భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ కూడా గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఇది బోర్డుల చేతుల్లో లేదు. ప్రపంచ టోర్నీలలో రెండు జట్లూ తలపడతాయి. అయితే  ఇరుదేశాల సిరీస్ లపై  ఆయా ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది. నేను గానీ, రమీజ్ రాజా (పీసీబీ చీఫ్) గానీ ఈ విషయంలో చేయగలిగిందేమీ లేదు’ అని తేల్చి చెప్పాడు. 

click me!