ఒక్క క్రికెటర్‌కి ఇన్ని రికార్డులా... టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వల్ల కానివి, చేసి చూపించిన విరాట్ కోహ్లీ...

First Published Nov 5, 2021, 12:00 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవచ్చు, టైటిల్ గెలవకపోవచ్చు, అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌పై అది ఎలాంటి ప్రభావం చూపించదు. ఎందుకంటే ఇప్పటికే స్టార్ క్రికెటర్ రేంజ్ నుంచి ‘లెజెండ్’ స్టేటస్ సంపాదించేసుకున్నాడు విరాట్ కోహ్లీ...

క్రికెట్ ప్రపంచంలో దేవుడిగా కీర్తించబడిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, ఆయన క్రియేట్ చేసిన రికార్డులు ఛేదించడం ఎవ్వరితరం కాదనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఓ ‘రన్ మెషిన్’... సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకొచ్చింది.. అత్యంత వేగంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు, వేల పరుగుల మైలురాళ్లు దాటుతూ దూసుకుపోతున్న ఆ మిస్సైల్ పేరు విరాట్ కోహ్లీ....

నవంబర్ 5, 1988లో న్యూఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ, 20 ఏళ్ల వయసులో 2008, ఆగస్టు 18న క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులు సృష్టించాడు విరాట్.

టెస్టు, వన్డే, టీ20 అనే తేడా లేకుండా మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ... ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేలకు పైగా పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం దాకా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే, ఏదో సరదాకి సెంచరీలు బాదుతున్నట్టే ఉండేది...

వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, మొత్తంగా 70 అంతర్జాతీయ శతకాలు బాదాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.

సచిన్ టెండల్కర్ 49 సెంచరీల తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీయే. టెస్టుల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు చేసిన క్రికెటర్ కూడా ‘కింగ్’ కోహ్లీయే.

టీ20ల్లో 29 హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ... ఈ ఫార్మాట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదుచేసిన క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో ఏడు డబుల్ సెంచరీలు బాదిన భారత క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు 

వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 8 వేలు, 9000, 10,000, 11 వేల మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ, 222 ఇన్నింగ్స్‌లో 11 వేల మైలురాయిని అందుకున్నాడు. 

ఒక దశాబ్ద కాలంలో 20 వేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ... 2016 ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐదు సీజన్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.

2019 వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు టీ20 వరల్డ్‌కప్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీయే. గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు. 

ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును నెం.1 టీమ్‌గా నిలిపాడు. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు (38 టెస్టు విజయాలు) అందించిన భారత కెప్టెన్ విరాట్...

శ్రీలంక, వెస్టిండీస్‌లపై వరుసగా మూడేసి సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. అలాగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆరుసార్లు 300+లకు పైగా పరుగులు చేసిన క్రికెటర్ కూడా కోహ్లీయే.

వన్డేల్లో విరాట్ కోహ్లీ చేసిన 43 సెంచరీల్లో 26 శతకాలు చేధనలో చేసినవి. వన్డే ఫార్మాట్‌లోనే ఇది ఓ రికార్డు. సచిన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ శతకాలు నమోదుచేశాడు.

ఐసీసీ టోర్నీల్లో 2008 నుంచి అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు గెలిచిన క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే.

టెస్టులు, వన్డేలు, టీ20 క్రికెట్... మూడు ఫార్మాట్లలో 50+ సగటు కలిగిన వన్ అండ్ ఓన్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ... టెస్టులు, వన్డే, టీ20 ఐసీసీ ర్యాంకింగ్‌లో టాప్ ర్యాంక్ సంపాదించిన ఒకే ఒక్క క్రికెటర్ కూడా కోహ్లీ.

2020 ఫోర్బ్స్ ‘ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టాప్ 100 అథ్లెక్స్’ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క క్రికెటర్ విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లలోనూ 30+ విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ..

click me!