టీమిండియాతో ఆడాలంటే వణుకు పుట్టాలి... కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్‌ ఎంట్రీపై...

First Published Nov 4, 2021, 4:39 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి, తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంది టీమిండియా. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తీయలేకపోవడం, తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఏ మాత్రం పోరాటం చూపించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఫెవరెట్ టీమ్‌గా బరిలో దిగింది భారత జట్టు. వరుస విజయాలతో టీమిండియా టాప్ క్లాస్ పర్పామెన్స్‌లు చూపిస్తుండడంతో పాటు ఎమ్మెస్ ధోనీ మెంటర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి..

అయితే వార్మప్ మ్యాచుల్లో చూపించిన ఆటతీరు, అసలైన మ్యాచుల్లో చూపించలేకపోయారు మన క్రికెటర్లు. ఎట్టకేలకు పసికూన ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది భారత జట్టు...

సరిగా ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ నడుస్తున్న సమయంలోనే టీమిండియా కొత్త హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను నియమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు... దీంతో ద్రావిడ్ వస్తూనే జట్టులో పాజిటివిటీ నింపాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

‘టీమిండియాకి హెడ్‌కోచ్‌గా ఉండదగిన బెస్ట్ పర్సన్ రాహుల్ ద్రావిడ్. అండర్19 జట్టును, ఇండియా ఏ జట్టును పటిష్టంగా తయారుచేసేందుకు రాహుల్ ద్రావిడ్ ఎన్నో ఏళ్లు శ్రమించారు. భారత జట్టుకు ఆయన అందించిన సేవలు, ఎవ్వరూ చేయలేదని చెప్పగలను’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

‘రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో టీమిండియా ఎవ్వరూ పడగొట్టలేని ఓ దృఢమైన వాల్‌గా తయారవ్వాలి.. అదే నా, మా కోరిక...’ అంటూ భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు...

‘టీమిండియా హెడ్‌కోచ్‌గా ద్రావిడ్ కంటే సరైన వ్యక్తిని తీసుకురాలేం. ఇండియన్ క్రికెట్‌కి ద్రావిడ్ ఎంతో సేవ చేశారు. హెడ్‌కోచ్‌గా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న ఆయనకి అభినందనలు. టీమిండియాను ఆయన మరింత ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తున్నా... చాలా సందర్భాల్లో ఎన్నో ఆనందాల్లో భాగమైన నా పార్టనర్‌కి బెస్ట్ విషెస్...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్..

‘భారత పురుషుల క్రికెట్ జట్టుకి హెడ్‌కోచ్‌గా నియమితులైన రాహుల్ ద్రావిడ్‌కి నా అభినందనలు. అపారమైన అనుభవం ఉన్న ఆయన నుంచి టీమిండియా ప్లేయర్లు ఎంతో నేర్చుకుంటారని ఆశిస్తున్నా... భారత జట్టుని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ద్రావిడ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్...

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకెల్ వాగన్ కూడా టీమిండియా కొత్త హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి శుభాకాంక్షలు తెలియచేశాడు. ‘నా ఉద్దేశంలో రాహుల్ ద్రావిడ్‌, టీమిండియా ఓ అద్భుతమైన హెడ్‌కోచ్‌గా మారబోతున్నాడు...’ అంటూ ట్వట్ చేశాడు వాగన్...

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రాహుల్ ద్రావిడ్‌‌ను టీమిండియా కొత్త హెడ్‌కోచ్‌గా నియమించడంపై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘నా మోస్ట్ ఫెవరెట్ క్రికెట్ రాహుల్ ద్రావిడ్, టీమిండియా కొత్త కోచ్‌గా నియమితం అయినందుకు శుభాకాంక్షలు... ఆయన శిక్షణలో టీమిండియా అత్యున్నత్త స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు కేటీఆర్...

రాహుల్ ద్రావిడ్‌ ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. 8 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన టీమిండియా, రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్ మారిన తర్వాత దృఢమైన శక్తిగా మారుతుందని, భారత జట్టుతో ఆడాలంటేనే ప్రత్యర్థులు భయపడేలా మారాలని కోరుకుంటున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్...

click me!