అవన్నీ వుట్టి వార్తలే, మమ్మల్ని ఎవరు బెదిరించలేదు... హసన్ ఆలీ భార్య సమియా కామెంట్స్...

First Published Nov 14, 2021, 8:24 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన పాకిస్తాన్, గ్రూప్ స్టేజ్‌లో ఐదుకి ఐదు విజయాలు అందుకుని, అందర్నీ అబ్బురపరిచింది. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది పాకిస్తాన్...

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన దశలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర హసన్ ఆలీ అందుకోలేకపోయాడు...

కీలక సమయంలో వచ్చిన లైఫ్‌ని చక్కగా వాడుకున్న మాథ్యూ వేడ్, షాహీన్ ఆఫ్రీదీ వేసిన ఆఖరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించేశాడు.

దీంతో గ్రూప్‌లో అజేయంగా నిలిచిన పాకిస్తాన్ పోరాటం సెమీస్‌తోనే ముగిసింది. మాథ్యూ వేడ్ క్యాచ్ పట్టుకుని ఉంటే, మ్యాచ్ గెలిచేవాళ్లమంటూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది...

ఈ మ్యాచ్ తర్వాత హసన్ ఆలీని, ఆయన భార్య సమీయా అర్జోపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దాడి చేశారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్. సమీయా అర్జో భారతీయులు రావడంతో ఆమెను బూతులు తిడుతూ, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారి సంఖ్య భారీగా ఉండింది...

భారత్‌లోని హర్యానా రాష్ట్రంలోని ఫరియాబాద్‌కి చెందిన సమీయా, భారత ప్రభుత్వాన్ని రక్షణ కోరుతున్నట్టుగా కొన్ని ట్వీట్లు వైరల్ అయ్యాయి... ‘కొందరు సిగ్గులేని క్రికెట్ ఫ్యాన్స్ నా ఏడాది కూతురిని కూడా వదలకుండా తిడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. నాకు ఉన్నతాధికారుల నుంచి రక్షణ కల్పిస్తామని భరోసా రాకపోతే, నేను హర్యానాలోని మా అమ్మగారికి వెళ్లిపోతాను. భారత విదేశీ వ్యవహరాల మంత్రి డాక్టర్ జై శంకర్ గారు, ఓ భారతీయురాలిగా నా రక్షణ బాధ్యతను స్వీకరించాల్సిందిగా కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేసింది సమీయా అర్జో...

‘నేను భారతీయురాలిగా జన్మించినందుకు గర్వపడుతున్నా. అదే విధంగా నేనే ఏ RAW ఏజెంట్‌ని కాదని, మా ఆయనని ఆ క్యాచ్ కావాలని వదిలేయలేదని పాకిస్తాన్ జనాలకు తెలియచేస్తున్నా. ఎందుకంటే ఆయన షియా మతానికి చెందిన వాడు. దయచేసి మమ్మల్ని సురక్షితంగా బతక నివ్వడం, ఇలా దాడి చేయకండి...

చాలా పాక్ అభిమానులు, నేను భారతీయులు కావడంతో లక్కీ కాదని, ఇండియన్ ఏజెంట్‌నని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. హసన్ ఆలీ ఆ క్యాచ్ డ్రాప్ చేసినందుకు చాలా బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు. కానీ మ్యాచ్ తర్వాత నేను, దుబాయ్‌లో ఉన్న, పాకిస్తాన్‌లో ఉన్న మా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి.. ’ అంటూ వరుస ట్వీట్లు చేసింది సమీయా అర్జో అని ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా...

అయితే ఈ ట్వీట్లు వైరల్ కావడం, పాక్ క్రికెటర్ భార్య, రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో అక్కడ చాలా పెద్ద దుమారమే రేగింది.. దీంతో ఆ ట్వీట్లు చేసిన అకౌంట్ డిలీట్ అయిపోయింది. 

‘నా పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి కొన్ని ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అది ఫేక్ అకౌంట్. నేను, హసన్, మా కూతురు బెదిరింపులను ఎదుర్కొంటున్నామన్న వార్తల్లో నిజం లేదు. అది పూర్తిగా అవాస్తవం...

మమ్మల్ని ఎవరు బెదిరించలేదు సరికదా, ఎంతో మంది మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. అలాంటి స్టేట్‌మెంట్స్‌ని నమ్మకండి. అలాంటి అకౌంట్లను ఫాలో అవ్వకండి. నేను ట్విట్టర్‌లో లేను. నాది అంటున్న ఆ ఖాతాపై రిపోర్ట్ చేయండి...’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను కోరింది సమియా అర్జో...
 

అయితే డిలీట్ చేసిన ఆ ట్విట్టర్ ఖాతాలో ప్రౌడ్ వైఫ్ ఆఫ్ హసన్ ఆలీని, క్రికెటర్ హసన్ ఆలీ అధికారిక ఖాతాను ట్యాగ్ చేయడం విశేషం. హసన్ ఆలీ అధికారిక ఖాతాను ట్యాగ్ చేసినా, ఇన్నాళ్లు ఎవ్వరూ గుర్తించలేదా? అంటూ అనుమానిస్తున్నారు. 

Latest Videos

click me!