వీళ్లేం మారలేదు... టికెట్ లేకుండానే స్టేడియంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఆఫ్ఘాన్, పాక్ ఫ్యాన్స్...

First Published Oct 30, 2021, 3:36 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో శుక్రవారం జరిగిన సూపర్ 12 రౌండ్‌లోని రెండు మ్యాచులూ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మజాని అందించాయి. వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగితే పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య మ్యాచ్ కూడా 19వ ఓవర్‌ వరకూ సాగింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూసేందుకు కూడా వేలాదిగా అభిమానులు తరలివచ్చారు...

కరోనా నిబంధనల కారణంగా స్టేడియంలో 60 శాతం అక్యూపెన్సీతో మాత్రమే అభిమానులను స్టేడియంలోకి అనుమతిస్తోంది యూఏఈ. ఆఫ్గాన్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కి సంబంధించి 16 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు ఐసీసీ తెలియచేసింది. అయితే చాలామంది టికెట్ లేకుండానే ఈ స్టేడియానికి చేరుకుని,గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు...

‘ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కి 16 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే టికెట్ ఉన్నవారితో పాటు కొన్ని వేల మంది వేదిక వద్దకు చేరుకుని టికెట్ లేకుండా స్టేడియంలో బలవంతంగా వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేశారు...’ అంటూ ఐసీసీ అధికారులు తెలియచేశారు...

దుబాయ్‌లో పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్‌ మ్యాచులు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. గత నాలుగేళ్లలో ఇక్కడ పాకిస్తాన్ 13 టీ20 మ్యాచులు ఆడగా, ఆఫ్ఘనిస్తాన్ 15 టీ20 మ్యాచులు ఆడింది. పొట్ట కూటి కోసం యూఏఈకి వలసొచ్చేవారిలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాసులే ఎక్కువగా ఉంటాయి. దీంతో పాక్, ఆఫ్ఘాన్ మ్యాచ్ చూసేందుకు భారీ స్థాయిలో జనాలు స్టేడియాలోకి చొచ్చుకురావాలని ప్రయత్నించడం హాట్ టాపిక్ అయ్యింది...

‘ఆఫ్ఘాన్ ఫ్యాన్స్, దయచేసి టికెట్ కొనుక్కుని, స్టేడియానిక రండి. అంతేకానీ ఇలా టికెట్ లేకుండా వచ్చి దేశం పరువు తీయకండి. ఇది మీకు కూడా మంచిది కాదు...’ అంటూ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశాడు ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ...

సెక్యూరిటీ కారణాలతో 7 గంటలకు ఆరంభమయ్యే మ్యాచ్‌కి టాస్ కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి రావాల్సి ఉంటుంది. 7 గంటలు దాటిన తర్వాత స్టేడియం గేట్లు మూసివేసి, అభిమానులను స్టేడియంలోకి అనుమతించరు. 

అయితే పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ సమయంలో మాత్రం స్టేడియం బయట వేల సంఖ్యలో అభిమానులు గుమిగూడి ఉండడం, వారిలో చాలామంది టికెట్ లేకుండానే స్టేడియంలోకి ప్రవేశించాలని ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య జరిగిన మ్యాచ్ హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. స్టేడియంలో కొట్టుకోవడమే కాకుండా, కొందరు ఆఫ్ఘాన్ అభిమానులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, మరో ఓవర్ ఉండగానే మ్యాచ్‌ని ముగించింది. ఆఫ్ఘాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 18 ఓవర్లు ముగిసేసరికి విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది పాక్...

ఈ దశలో ఒక్క వికెట్ పడినా ఆఫ్ఘాన్‌కే విజయం దక్కుతున్నారనుకున్నారంతా. అయితే కరీం జనత్ వేసిన 19వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన అసిఫ్ ఆలీ మ్యాచ్‌ను ముగించేశారు.

7 బంతుల్లో 4 సిక్సర్లతో 25 పరుగులు చేసిన అసిఫ్ ఆలీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఆఫ్ఘాన్ సంచలనం రషీద్ ఖాన్, టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా టీ20ల్లో 100 వికెట్లు పూర్తిచేసుకున్న బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రషీద్ ఖాన్...

click me!