బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ దాదా గిరి... పదవీకాలం ముగిసి ఏడాది దాటినా అదే సీటులో...

First Published Oct 29, 2021, 10:35 PM IST

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహిస్తోంది బీసీసీఐ. షెడ్యూల్ ప్రకారం భారత్‌లో జరగాల్సిన ఈ పొట్టి వరల్డ్‌కప్ టోర్నీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూఏఈ, ఓమన్ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో పాటు ప్రపంచమంతా కరోనా విపత్తుతో వణికిపోతున్న సమయంలో ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది భారత క్రికెట్ బోర్డు...

ఐపీఎల్ 2020 సూపర్ సక్సెస్ తర్వాత భారత్ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్‌ను ప్రారంభించింది. సీజన్ మధ్యలో కరోనా కేసులు వెలుగు చూడడంతో బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి...

అయితే వాటికి ఐపీఎల్ 2021 సెకండాఫ్‌తో సమాధానం చెప్పింది భారత క్రికెట్ బోర్డు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల వెనకాల ఉన్నది మరెవరో కాదు, బీసీసీఐ బాస్, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ...

ఐపీఎల్ 2022 సీజన్‌ను 10 జట్లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న గంగూలీ కారణంగా బీసీసీఐకి రూ.12 వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం చేకూరింది. ఐపీఎల్ ప్రసార హక్కుల రూపంలో మరో రూ.35 వేల కోట్లు రానుంది...

జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించి కూడా సూపర్ హిట్ చేసిన గంగూలీ, ఒకేసారి రెండు భిన్నమైన జట్లతో రెండు భిన్నమైన సిరీస్‌లు ఆడించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో జట్టు శ్రీలంకలో సిరీస్ ఆడింది...

అక్టోబర్ 2019లో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు సౌరవ్ గంగూలీ. దాదాతో పాటు బీసీసీఐ సెక్రటరీగా అమిత్ షా కొడుకు జై షా బాధ్యతలు స్వీకరించాడు...

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం లోధా కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాల రిపోర్టు ఆధారంగా సుప్రీం కోర్టు, పూర్వ బోర్డు సభ్యులను తొలగించి సౌరవ్ గంగూలీ, జై షాలకు అధికారం అప్పగించిది... అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ బీసీసీఐ రాజ్యాంగాన్ని అతిక్రమించే ప్రమాదంలో పడ్డారు..

జనవరి 2016లో బీసీసీఐ రాజ్యాంగంలో కొన్ని సంచలన మార్పులు అవసరమని భావించిన లోధా కమిటీ, బోర్డు అధికారులు, పదవీకాలం ముగిసినా ఆ పదవిలో కొనసాగుతుండడాన్ని గుర్తించారు. 

లోధా కమిటీ సూచించిన మార్పులను అమలు చేయడంలో ఫెయిల్ కావడంతో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న అనురాగ్ ఠాకూర్‌ను ఆ పదవి నుంచి తొలగించింది సుప్రీం కోర్టు...

2019లో అడ్మినేస్టేటర్స్ కమిటీ (సీఓఏ)ని నియమించి, కొత్త బీసీసీఐ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చింది. రాజ్యాంగంలో చేసిన మార్పుల ప్రకారం భారత క్రికెట్‌లో ఏ పదవిలో ఉన్న అధికారులైనా రెండు సార్లు మాత్రమే (ఒక్కోసారి మూడేళ్ల చొప్పున ఆరేళ్ల పాటు) అధికారం స్వీకరించడానికి అవకాశం ఉంటుంది...

అంటే బీసీసీఐలో ఏదైనా అధికారం స్వీకరించిన వ్యక్తి, ఆరేళ్ల పాటు మాత్రమే బోర్డులో పదవిని అనుభవించడానికి ఉంటుంది. ఉదాహరణకు బెంగాల్ క్రికెట్ అకాడమీకి ప్రెసిడెంట్‌గా ఐదేన్నరేళ్లు పనిచేసిన గంగూలీ, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పదవి స్వీకరిస్తే ఆరు నెలల్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే...

అక్టోబర్ 2019లో బీసీసీఐ బోర్డు ద్వారా ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ, సెక్రటరీగా జే షా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరి పదవీకాలం కేవలం ఆరు నెలల మాత్రమే...

2020 జూలై 27తో సౌరవ్ గంగూలీ, బీసీసీఐలో ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోగా, జై షా ఆరేళ్ల పదవీకాలం ముగించుకుని చాలా రోజులే అవుతోంది. అయితే ఈ ఇద్దరూ ఏడాదికి పైగా తమ తమ పదవుల్లో బీసీసీఐ చట్టవిరుద్ధంగా కొనసాగుతున్నారు...

లోధా కమిటీ ఇచ్చిన మార్గనిర్దేశకాలను అమలు చేయడంలో విఫలమైనందుకే అనురాగ్ ఠాకూర్‌ను బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి అత్యున్నత్త న్యాయస్థానం, ఇప్పటిదాకా అదే తప్పు చేస్తున్న గంగూలీ, జై షాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.

click me!