ఆఫ్ఘనిస్తాన్‌కి షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా... ఇలాంటి పరిస్థితుల్లో మీతో మ్యాచ్ ఆడలేమంటూ...

First Published Nov 5, 2021, 4:16 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మంచి పర్ఫామెన్స్ ఇస్తోంది ఆఫ్ఘాన్. తాలిబన్ల చేతుల్లోకి దేశం వెళ్లిన తర్వాత కూడా ఎన్నో కష్టాలను, అడ్డంకులను దాటి వచ్చి, పొట్టి ప్రపంచకప్‌‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారు ఆఫ్ఘాన్ క్రికెటర్లు. 

గత రెండేళ్లుగా టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్ చూపించిన ఆటతీరు కారణంగా నేరుగా సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది.... 2014 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టైటిల్ గెలిచిన శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. 

ఈ రెండు జట్లూ క్వాలిఫైయర్స్‌లో పోటీ పడి, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాయి. బంగ్లాదేశ్ సూపర్ 12 రౌండ్‌లో ఐదుకి ఐదు మ్యాచుల్లో ఓడితే, శ్రీలంక జట్టు 5 మ్యాచుల్లో రెండు విజయాలతో టోర్నీని ముగించింది...

ఆ రెండు జట్లతో పోలిస్తే ఆఫ్ఘానిస్తాన్ ఆటతీరు చాలా మెరుగ్గా ఉంది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టు ఆడాల్సి ఉంది ఆఫ్ఘనిస్తాన్. 

ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నవంబర్ 27 నుంచి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే టెస్టుల్లో రాణిస్తున్న ఆఫ్ఘాన్‌కి ఆసీస్‌తో ఇదే తొలి టెస్టు మ్యాచ్... అయితే ఈ టెస్టును నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా జట్టు...

వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో ఈ టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే కరోనా విపత్తు కారణంగా అప్పుడు నిర్వహించడం వీలు కాలేదు. తాజాగా ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న పరిస్తితులతో ఆస్ట్రేలియా, టెస్టు మ్యాచ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 

తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత శరీర భాగాలు కనిపించేలా బట్టలు వేసుకుంటున్నారనే కారణంగా మహిళల క్రీడలపై నిషేధం విధించారు.  ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుకి పూర్తి సపోర్ట్ ప్రకటించిన తాలిబన్లు, ఆఫ్ఘాన్ మహిళల జట్టును నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఇదే ఆస్ట్రేలియాకి కోపం రావడానికి కారణమైంది... పురుషుల జట్టుతో టెస్టు మ్యాచ్ ఆడే సమయంలోనే ఆఫ్ఘాన్ మహిళా జట్టుతో, ఆస్ట్రేలియా మహిళా జట్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఆఫ్ఘాన్ మహిళా క్రికెట్ టీమ్‌పై తాలిబన్ ప్రభుత్వం బ్యాన్ వేయడంతో మహిళల క్రికెట్ సిరీస్‌ రద్దు అయ్యింది...

పురుషులతో క్రికెట్ ఆడాలంటే, మహిళా క్రికెట్‌పై విధించిన బ్యాన్ ఎత్తివేయాలని ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే తాలిబన్లు మాత్రం మహిళలు క్రీడలు ఆడుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పేశారు.

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ నిర్వహించడం సరికాదని మేం భావిస్తున్నాం. అందుకే స్టాక్ హోల్డర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత ఆఫ్ఘాన్‌తో జరగాల్సిన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం... 

ఆఫ్ఘనిస్తాన్‌లో పురుషుల, మహిళల క్రికెట్ అభివృద్ధికి కావాల్సిన మద్ధతు ఇవ్వడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, పరస్థితులు సద్ధుమణిగేదాకా ఈ టెస్టును వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం...’ అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా...

తాలిబన్లు ప్రభుత్వం చేపట్టడంతో పాటు మహిళల క్రీడలపై నిషేధం విధించడంతో ఆఫ్ఘాన్‌ పురుషుల క్రికెట్ జట్టును కూడా బ్యాన్ చేయాలని భావిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). 

 లింగ వివక్ష, వర్ణ వివక్ష చూపించే ఏ బోర్డుకి కూడా ఐసీసీలో భాగంగా ఉండేందుకు అర్హత ఉండదు. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటుంది ఐసీసీ...

click me!