ఛీ,ఛీ.. రిటైర్మెంట్ ఆలోచనే లేదు, కేవలం ఫన్ కోసమే అలా చేశా... క్లారిటీ ఇచ్చిన క్రిస్ గేల్...

First Published Nov 7, 2021, 3:56 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో వెస్టిండీస్ ఆడిన ఆఖరి మ్యాచ్‌లో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నంతగా బిల్డప్ ఇచ్చాడు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్. మనోడి బిల్డప్, బిహేవియర్ చూసి, థ్యాంక్యూ క్రిస్ గేల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు, ఎమోషనల్ స్టేటస్‌లు కూడా హల్‌చల్ చేశాయి. అయితే ఇప్పట్లో రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనే లేదంటున్నాడు క్రిస్ గేల్... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మొదలెట్టింది వెస్టిండీస్. ఇప్పటికే రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్, ఈసారి కూడా టైటిల్ గెలుస్తుందని అభిమానులు భావించిరు. మోస్ట్ ఫెవరెట్‌ టీమ్‌గా టోర్నీని మొదలెట్టింది విండీస్. 

అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 55 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని చవిచూసిన వెస్టిండీస్, ఆ తర్వాత సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచుల్లోనూ ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది...

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం అందుకున్న వెస్టిండీస్‌ జట్టుకి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్‌గా మారింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఆస్ట్రేలియాకి మాత్రం ఈ మ్యాచ్ విజయం అత్యంత ఆవశ్యకం. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి సునాయాస విజయాన్ని అందుకుంది.  

ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 12 రౌండ్ మ్యాచ్, వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మారింది. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో, ఆ తర్వాతి ఏడాది మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు...

టీ20 క్రికెట్‌లో లెజెండరీ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న డీజే బ్రావో, ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడి ఆ జట్టు టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు.. అయితే బ్రావో రిటైర్మెంట్‌కి తగినంత గుర్తింపు రాలేదు. కారణం క్రిస్ గేల్ రిటైర్మెంట్ ఇస్తున్నాడనే వార్తే... 

2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలోనే క్రిస్ గేల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది... అయితే ఇప్పట్లో ఆ ఆలోచన లేదని, అవసరమైతే మరో ఐదేళ్లు ఆడతానని కామెంట్ చేశాడు క్రిస్ గేల్. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ చేసిన కొన్ని పనులు, ఇదే అతని ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని సూచనలు ఇచ్చాయి...

హెల్మెట్ లోపల కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్ గేల్‌, క్రీజులోకి అడుగుపెట్టేందుకు ముందు విండీస్ ప్లేయర్లు లేచి నిలబడి చప్పట్లతో అతన్ని సాగనంపారు... 9 బంతుల్లో 15 పరుగులు చేసి అవుటైన క్రిస్ గేల్, డగౌట్‌లోకి వచ్చిన తర్వాత హెల్మెట్ తీసి, బ్యాట్‌తో అభిమానులకు అభివాదం చేశాడు. అంతేకాకుండా తన గ్లవ్స్‌ని అభిమానులకు అందించాడు... 

అయితే ఇంతా చేసి, ‘తూచ్... నేను రిటైర్మెంట్ ప్రకటించడం లేదంటూ’... అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు క్రిస్ గేల్. ‘నేను జస్ట్ సరదాగా అలా చేశా. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన దాన్ని మార్చిపోయి, అభిమానులతో కలిసి సరదాగా మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలనుకున్నా...

ఇది నా ఆఖరి వరల్డ్ కప్ గేమ్ కావచ్చు. నేను రిటైర్మెంట్ తీసుకోవడం లేదు. అవకాశం వస్తే, ఇంకో వరల్డ్‌కప్ కూడా ఆడుతా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను ఇంకో వరల్డ్‌కప్ ఆడిస్తారని అనుకోవడం లేదు...

నా కెరీర్‌ అసాధారణమైనది. దాన్ని ఇలా ముగించాలని అనుకోవడం లేదు. జమైకాలో ఒక్క మ్యాచ్ ఇవ్వండి. నా సొంత జనాల ముందు అందరికీ ‘థ్యాంక్యూ...’ చెప్పి, తప్పుకుంటా. చూద్దాం... అలా కాకపోతే ఎన్ని రోజులపాటు క్రికెట్‌లో కొనసాగుతానో తెలీదు...

అందరికీ తెలియని విషయం ఏంటంటే... ఈ వరల్డ్‌కప్ మొదటి మ్యాచ్ సమయం నుంచే మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఈ రాత్రికి జమైకా వెళ్లి, ఆయన్ని చూసి, ఎలా ఉందో కనుక్కోవాలి... ఆయనకి 91 ఏళ్లు... ’ అంటూ కామెంట్ చేశాడు 42 ఏళ్ల క్రిస్ గేల్...

click me!