IPL 2022: టీమిండియా కోచ్ పై కన్నేసిన ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ.. శాస్త్రికి డిమాండ్ మాములుగా లేదుగా..

First Published Nov 7, 2021, 1:11 PM IST

Ravi Shastri: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల వేలంలో అహ్మాదాబాద్ ను రూ. 5,600 కోట్లతో దక్కించుకున్న సీవీసీ పార్ట్నర్స్.. ఇప్పటికే శాస్త్రిని సంప్రదించి భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి త్వరలోనే భారత జట్టు ప్రధాన శిక్షకుడిగా దిగిపోనున్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్పే శాస్త్రికి చివరి సిరీస్.  అయితే టీమిండియా కోచ్ గా దిగిపోయినా అతడికి  మాత్రం డిమాండ్ భారీగానే ఉంది.

ఐపీఎల్ లో తమ  జట్టుకు హెడ్ కోచ్ గా ఉండాలని ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు రవిశాస్త్రిని సంప్రదించినట్టు వార్తలు వినిపించాయి. ఐపీఎల్ లో కప్పు కోసం గత 14 సీజన్లుగా వేయి కండ్లతో ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. కోచ్ పదవికి శాస్త్రిని అడిగినట్టు వార్తలు వచ్చాయి. 

అయితే దీనిపై శాస్త్రి ఇంతవరకూ తన నిర్ణయమేమీ  వెల్లడించలేదు. కాగా.. ఆర్సీబీతో పాటు ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కూడా రవిశాస్త్రిపైనే కన్నేసినట్టు తెలుస్తున్నది. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల వేలంలో అహ్మాదాబాద్ ను రూ. 5,600 కోట్లతో దక్కించుకున్న సీవీసీ పార్ట్నర్స్.. తమ జట్టుకు రవిశాస్త్రిని ప్రధాన శిక్షకుడిగా తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇందుకు సంబంధించి  ఆ జట్టు ప్రతినిధులు ఇప్పటికే శాస్త్రిని సంప్రదించి భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి శాస్త్రి నిర్ణయం ఏమిటన్నది ఇప్పటికైతే సస్పెన్స్.  యూఏఈ నుంచి తిరిగొచ్చిన  తర్వాత శాస్త్రి దీనిపై తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 

శాస్త్రితో పాటు టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా ఉన్న భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ లకు కూడా ఐపీఎల్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. గత కొన్నాళ్లుగా రవిశాస్త్రి సారథ్యంలోని భారత శిక్షక బృందం.. ఆటగాళ్లను సానబెడుతున్నది.  ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించడం.. విదేశాల్లో టెస్టు సిరీస్ లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భారత్ ఫైనల్ కు చేరడం.. ఇలా ఇవన్నీ శాస్త్రి, అతడి సహాయక బృందం హయాంలో జరిగినవే కావడంతో వారికి డిమాండ్ భారీగా ఉంది.

కాగా కోచ్ గా బాధ్యతలు విరమించాక శాస్త్రి మళ్లీ కామెంట్రీ రూమ్ లోకి వచ్చి తనదైన శైలిలో క్రికెట్ వ్యాఖ్యానంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు పదవులు నిర్వర్తించడానికి అవకాశంలేదు. అది విరుద్ద ప్రయోజనాల కిందకు వస్తుంది. కానీ,  శాస్త్రికి ఒక అవకాశం ఉంది. 

ఒకవేళ అతడు అహ్మదాబాద్ జట్టుకు కోచ్ గా ఉన్నా.. ఐపీఎల్ లో నాన్ కామెంట్రీ  బాధ్యతలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్  మాదిరి. లక్ష్మణ్.. మెంటార్ గా ఉంటూనే ఇన్నింగ్స్ మధ్యలో, అయిపోయిన తర్వాత  మ్యాచ్ గురించి విశ్లేషణ చేస్తుంటాడు. అయితే కామెంటరీ మాత్రం చెప్పే అవకాశముండదు. మరి శాస్త్రి..  ఈ రెండు బాధ్యతల్లో దేని వైపు మొగ్గు చూపుతాడో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. 

ఐపీఎల్-2022 సీజన్ మరో  ఐదు నెలల్లో మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు కొత్త జట్లను ప్రకటించగా.. జనవరి మొదటి వారంలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. 

click me!