టీమ్‌ను ఎలా సెలక్ట్ చేయాలో, వాళ్లను చూసి నేర్చుకోండి... బీసీసీఐ సెలక్టర్లకు ఆకాశ్ చోప్రా సలహా...

First Published Nov 7, 2021, 2:55 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ప్రదర్శన, టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నిరుత్సాహానికి గురి చేసింది. టైటిల్ ఫెవరెట్స్‌గా టోర్నీని ఆరంభించిన టీమిండియా, మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి, ప్లేఆఫ్స్ కోసం మిగిలిన దేశాల పర్ఫామెన్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితుల్లో పడింది...

న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఏ మాత్రం పోరాటం చూపించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యింది భారత జట్టు...

ఐపీఎల్‌తో పాటు వారం గ్యాప్ లేకుండా ఆడుతున్న క్రికెట్ టోర్నీల కారణంగానే తాము అలసిపోయామని భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చేసిన కామెంట్లు... బీసీసీఐపై బీభత్సమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది...

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా, బీసీసీఐ టీమ్ సెలక్షన్ విషయంలో అనుసరిస్తున్న విధానాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు టీమ్ సెలక్షన్ ఎలా చేయాలో ఇంగ్లాండ్‌ను చూసి నేర్చుకోవాలంటూ చివాట్లు పెట్టాడు...

‘ఇంగ్లాండ్ జట్టు ఓ ఫిలాసఫీ ప్రకారం జట్టును ఎంపిక చేస్తుంది. వారికి ఏ ఫార్మాట్‌కి ఎలాంటి క్రికెటర్లు కావాలో సుస్పష్టమైన అంచనా, క్లారిటీ ఉంటుంది. అదే కౌంటీల ప్రదర్శన ఆధారంగా ఆల్‌రౌండర్లను ఏరికోరి ఎంచుకుంటారు...

కౌంటీ క్రికెట్‌ ఆడే వారికి వైట్ బాల్ క్రికెట్‌కి ఎంపిక చేయరు. అలాగే రెడ్ బాల్ క్రికెట్‌లో రాణించేవారికి టీ20ల్లో ప్లేస్ ఉండదు. టెస్టు కెప్టెన్ జో రూట్‌ని చూడండి... టెస్టుల్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. 

జో రూట్‌కి టీ20ల్లో 125 స్టైయిక్ రేటు ఉంది. అయినా కూడా అతన్ని టీ20లకు ఎంపిక చేయరు. అదే టీమిండియా విషయానికి వస్తే, జో రూట్‌కి టీ20ల్లో ప్లేస్ ఉండడమే కాదు, కెప్టెన్సీ ఇచ్చినా ఇచ్చేస్తారు...

ఇంగ్లాండ్ జట్టుకీ, ఇండియాకి ఉన్న తేడా అదే. వాళ్లు ఫార్మాట్‌ని బట్టి గెలుపు గుర్రాలను ఎంచుకుంటారు. అందుకే మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్లు సగం మంది కూడా ఉండరు. అదే టీమిండియా విషయానికి వస్తే, ముగ్గురు, నలుగురు తప్ప మిగిలిన అందరూ మూడు ఫార్మాట్లు ఆడతారు...

డేవిడ్ మలాన్ టీ20 జట్టులో ఉంటాడు. కాబట్టి అత్యవసరమైతే తప్ప అతన్ని టెస్టుల్లో ఆడించరు. అలాగే మొయిన్ ఆలీ, అదిల్ రషీద్‌లకు వారి నుంచి ఏం ఆశిస్తున్నారో జట్టు ముందే క్లియర్‌గా చెప్పి ఉంటుంది...

జట్టుకి ఏం కావాలో వారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ ప్లేయర్లు లేకపోయినా ఇంగ్లాండ్ జట్టు సెమీస్ చేరుకుంది...

అయితే భారత జట్టు విషయంలో అలా జరిగేదా? విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లు లేకపోతే టీమిండియా ఇలా ఆడగలదా? అందుకే టీమ్‌ను ఎలా సెలక్ట్ చేయాలో ఇంగ్లాండ్ నుంచి నేర్చుకుంటే మంచిది...

వీడు బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు, వాడు బౌలింగ్ బాగా చేస్తున్నాడని తీసుకుని వారిని ఎలా ఆడించాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మెరుగైన ఫలితాలు రావు. జట్టు మొత్తం కలిసి ఎలా ఆడాలో ప్లానింగ్ రావాలి...

ఇండియానే కాదు, పక్కనున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు కూడా ఇదే తీరు. ప్లేయర్లకు ప్రాధాన్యం ఇస్తారు. మోర్గాన్‌కి టెస్టుల్లో ప్లేస్ లేకపోయినా అతనేం ఫీల్ కాడు, కానీ ఇండియాలో అలా ఉండదు. టీ20, వన్డే కెప్టెన్, టెస్టుల్లో లేకపోతే ఎలా అని... తెగ ఫీలైపోతారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా...

click me!