T20 World Cup 2026 : టీమిండియా చేతిలో ఘోర పరాజయం తర్వాత పాకిస్థాన్ సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అమెరికా టీం నుండి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఇప్పటికే పాయింట్స్ టేబుల్ లో పాక్ కంటే మెరుగైన స్థానంలో USA టీం ఉంది.
ICC Men's T20 World Cup 2026 : ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2026 లో మరో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిన్న జట్లుగా చెప్పుకునే జింబాబ్వే, అమెరికా అద్భుతాలు చేసి చూపించాయి. బలమైన ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే... పాకిస్థాన్ ను ఓడించినంత పనిచేసి అమెరికా తాము పసికూనలం కాదని నిరూపించాయి. టాప్ టీమ్స్ ను వెనక్కినెట్టి పాయింట్ టేబుల్ లో మెరుగైన స్థానంలో నిలిచిన ఈ జట్లకు సూపర్ 8 అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
ముఖ్యంగా భారత్ చేతిలో ఘోర పరాజయం తర్వాత పాకిస్థాన్ సూపర్ 8 ఆశలు సన్నగిల్లాయి... ఈ జట్టుకు అమెరికా రూపంలో గండం పొంచివుంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఏ లో టీమిండియా ఓటమన్నదే ఎరగకుండా మూడు మ్యాచుల్లో విజయం సాధించింది... దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకుంది. మరి ఈ గ్రూప్ ఏ నుండి సూపర్ 8 కి చేరే రెండో జట్టు ఏది అన్నది ఆసక్తికరంగా మారింది.... పాకిస్థాన్ తో పాటు అమెరికాకు కూడా ఈ అవకాశాలు ఉన్నాయి.
24
అమెరికా సూపర్ 8 కి చేరే అవకాశాలు ఎలా ఉన్నాయి..?
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ ఏలో భారత్ 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో USA Team ఉంది... ఈ జట్టు రెండు విజయాలు, రెండు ఓటములతో 4 పాయింట్లు సాధించింది. పాకిస్థాన్ కూడా 3 మ్యాచుల్లో 2 విజయాలు సాధించినా మెరుగైన రన్ రేట్ కారణంగా అమెరికా ముందుంది.
అయితే పాకిస్థాన్ సూపర్ 8 కి చేరాలంటే తప్పకుండా తర్వాత జరిగే మ్యాచ్ గెలవాల్సిందే. ఫిబ్రవరి 18న నమీబియాతో పాక్ తలపడనుంది... ఈ మ్యాచ్ గ్రూప్ ఏ నుండి సూపర్ 8 కి చేరే జట్టు ఏదనేది నిర్ణయిస్తుంది. ఒకవేళ పాక్ ఓటమిపాలయితే అమెరికాతో సమానంగా రెండు విజయాలతో 4 పాయింట్ల వద్ద నిలుస్తుంది. ఈ క్రమంలో మెరుగైన రన్ రేట్ (0.788) కలిగిన అమెరికా సూపర్ 8 కి అర్హత సాధిస్తుంది.
34
పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన అమెరికా...
ఇప్పటికే పాకిస్థాన్ కు అమెరికా చుక్కలు చూపించింది... దాదాపు ఓడించినంత పని చేసింది. ఫిబ్రవరి 10న టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబోలో పాక్, యూఎస్ఏ తలపడ్డాయి... ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 190 పరుగులు చేసింది. అయితే 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా అద్భుతంగా ఆడింది... శుభమ్ రంజనే 30 బంతుల్లో 50 పరుగులు, ఓపెనర్ శయన్ జహంగిర్ 34 బంతుల్లో 49 పరుగులతో రాణించడంతో ఓ దశలో అమెరికా విజయం దిశగా నడిచింది. ఇలా పాక్ ను కంగారుపెట్టిన యూఎస్ టీం 158 పరుగులు చేయగలిగింది... చివర్లో వికెట్లు పడటంతో పాక్ ఊపిరిపీల్చుకుంది… అద్భుతంగా ఆడినా యూఎస్ టీం ఓడిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు అదే అమెరికా మరోసారి పాక్ ను కంగారు పెడుతోంది. అసలే భారత్ చేతిలో ఓటమి, పసికూన అమెరికా చేతిలో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు సాధించిన విజయంతో పాక్ పరువు పోయింది. ఇక నమీబియా చేతిలోనూ ఓడిపోతే టీ20 వరల్డ్ కప్ నుండి పాక్ ఔట్ అవుతుంది... అమెరికా ముందుకు వెళుతుంది. ఒకవేళ అమెరికా సూపర్ 8 కి చేరితే అది సంచలనమే అని చెప్పాలి.
వరల్డ్ కప్ 2026 గ్రూప్ బి లో కూడా మరో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాపై జింబాబ్వే అద్భుత విజయం సాధించింది.. దీంతో ఈ టీం అనూహ్యంగా పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి చేరింది. మిగతా రెండు మ్యాచులు ఐర్లాండ్, శ్రీలంకతో ఆడాల్సి ఉంది... ఇందులో ఒక్క విజయం సాధించినా జింబాబ్వే సూపర్ 8 కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
గ్రూప్ బిలో 2 విజయాలతో శ్రీలంక, జింబాబ్వే సమానంగా నిలిచాయి. అయితే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో శ్రీలంక ఫస్ట్, జింబ్వాబ్వే సెకండ్ ప్లేస్ లో నిలిచాయి. ఓ విజయం, ఓ ఓటమితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు జట్లలో రెండు సూపర్ 8 కి చేరతాయి... ఇందులో ఎక్కువ అవకాశాలున్నది జింబాబ్వేకే.