India vs Pakistan T20 World Cup 2026 : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదలకానుంది. ఈ టోర్నీలో హైఓల్టేజ్ మ్యాచ్ ఇండియా vs పాాకిస్థాన్ ఎప్పుడుంటుందో తెలుసా?
India vs Pakistan : దాయాది దేశాలు ఇండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు... ఇరుదేశాలు చాలా సీరియస్ గా తీసుకుంటాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది... మరీముఖ్యంగా భారతీయులు పాకిస్థాన్ పై విజయాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కు టైం ఫిక్స్ అయ్యింది. టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇవాళ (నవంబర్ 25, మంగళవారం) వెలువడనుంది... అయితే భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరగనున్నట్లు సమాచారం. దీంతో సాధారణమైన సండేల్లా కాకుండా ఫిబ్రవరి 15 సూపర్ సండేగా మారిపోనుంది.
26
భారత్ vs పాకిస్థాన్ బ్లాక్‌బస్టర్ పోరు
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) షెడ్యూల్ ప్రకటించనుంది... ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి.
ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి... ఇరుదేశాల మధ్య మూడు మ్యాచులు జరిగితే మూడింట భారత్ దే విజయం. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో మన తెలుగబ్బాయి తిలక్ వర్మ అద్భుతమైన ఆటతీరుతో విజయాన్ని అందించాడు. ఆసియాకప్ తర్వాత ఈ రెండు జట్లు తలపడేది టీ20 వరల్డ్ కప్ 2026 లోనే. ఫిబ్రవరి 15న ఇరుదేశాల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరగనుంది.
36
భారత్ గ్రూప్ స్టేజ్ షెడ్యూల్
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ప్రకారం... భారత్, పాకిస్థాన్‌లతో పాటు యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. టోర్నమెంట్ ప్రారంభ రోజైన ఫిబ్రవరి 7న ముంబైలో యూఎస్ఏతో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడేందుకు ఢిల్లీకి వెళ్తుంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్ తో తలపడనుంది. వారి చివరి గ్రూప్ గేమ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో ఉంటుంది.
గ్రూప్ దశల్లో రోజుకు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. 2026 ఎడిషన్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా, పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్‌లను కొలంబో లేదా క్యాండీలో ఆడుతుంది. టోర్నమెంట్ ఫార్మాట్‌లో మార్పు లేదు.
20 జట్లను ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు జట్లు సూపర్ ఎయిట్ దశకు అర్హత సాధిస్తాయి. అక్కడ జట్లను నాలుగు చొప్పున గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్తాయి.
56
సూపర్ ఎయిట్, నాకౌట్ స్టేజ్
భారత్ సూపర్ ఎయిట్ దశకు వెళితే, వారి మూడు సూపర్ ఎయిట్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతాలో జరుగుతాయి. భారత్ సెమీఫైనల్స్‌కు చేరితే, వారి సెమీఫైనల్ ముంబైలో జరుగుతుంది. పాకిస్థాన్ లేదా శ్రీలంక అర్హత సాధించడాన్ని బట్టి మరో సెమీఫైనల్ స్టేజ్ కొలంబో లేదా కోల్‌కతాలో ఉంటుంది. ఫైనల్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. కానీ పాకిస్థాన్ ఫైనల్‌కు చేరితే, అది కొలంబోకు మారే అవకాశం ఉంది.
66
టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లివే
ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంక కాకుండా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే మిగతా 18 జట్లు: ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, యూఏఈ.