టీ20 వరల్డ్‌కప్ జట్టులో మూడు మార్పులు... పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కి ఛాన్స్...

First Published Oct 9, 2021, 10:26 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన జట్టులో కీలక మార్పులు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తోపాటు హైదర్ ఆలీకి తుదుజట్టులో చోటు దక్కింది. 

గతంలో టీ20 వరల్డ్‌కప్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ ఆజమ్ ఖాన్, మహ్మద్ హుస్సేన్‌ల స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ ఆలీలు జట్టులోకి వచ్చారు...

58 టీ20 మ్యాచులు ఆడిన సర్ఫరాజ్ అహ్మద్, 3 హాఫ్ సెంచరీలతో 812 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా వరుసగా 11 టీ20 సిరీస్‌లను గెలిచింది పాకిస్తాన్... 

హసన్ ఆలీ 41 టీ20 మ్యాచుల్లో 52 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్న హసన్ ఆలీ, టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌కి ప్రధాన అస్త్రంగా మారతాడని భావిస్తోంది పాక్ జట్టు.

అలాగే రిజర్వు ప్లేయర్‌గా ఉన్న ఫకార్ జమాన్‌ను తుది జట్టులో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కెరీర్ ఆరంభంలో కోహ్లీతో పోటీపడగలడని ప్రశంసలు అందుకున్న ఫకార్ జమాన్, 52 టీ20ల్లో 1006 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్టును ప్రకటించిన సమయంలో పాక్ క్రికెట్ బోర్డులో లుకలుకలు మొదలయ్యాయి. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టుతో సంతృప్తి చెందని పాక్ కోచ్ మిస్బావుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌ తమ పదవులకు రాజీనామా సమర్పించారు. 

దీంతో వారి స్థానంలో ఆసీస్ మాజీ బ్యాట్స్‌మెన్ మాథ్యూ హేడెన్‌ను హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ బౌలర్ వర్నాన్ ఫలిందర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పాక్ క్రికెట్ బోర్డు...

ఈ ఇద్దరూ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి బాధ్యతలు తీసుకోబోతున్నారు. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రమీజ్ రాజాకి టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపక చేసిన జట్టులో మార్పులు చేయాల్సిందిగా పాక్ మాజీ కెప్టెన్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేశాడు. అందుకే ఆఖరి నిమిషంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది పీసీబీ..

గ్రూప్ 2లో ఉన్న పాకిస్తాన్, భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు గ్రూప్ దశ నుంచి క్వాలిఫై వచ్చే మరో రెండు జట్లతో తలబడనుంది. 

అక్టోబర్ 24న ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 26న న్యూజిలాండ్‌తో, 29న ఆఫ్ఘనిస్తాన్‌లతో మ్యాచులు ఆడుతుంది పాకిస్తాన్... 

click me!