IPL2021 SRH vs MI: పోరాడి ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ముంబై ఐదులో, ఆరెంజ్ ఆర్మీ ఆఖర్లో...

First Published Oct 8, 2021, 11:32 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో లీగ్ మ్యాచులు ముగిశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్, ఐదో స్థానంతో సీజన్‌ని ముగించగా... ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడినా మంచి పోరాటాన్ని చూపించింది ఆరెంజ్ ఆర్మీ...

ఐపీఎల్ 2021 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవడానికి అవసరమైన భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్‌ను స్వల్ప స్కోరుకి  కట్టడి చేయడంలో మాత్రం విఫలమైంది.

బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై 236 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు... 

5.2 ఓవర్లలో 64 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత జాసన్ రాయ్ 21 బంతుల్లో 6 సిక్సర్లతో 34 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

తొలి వికెట్‌కే 64 పరుగుల భాగస్వామ్యం రావడంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే కావాల్సిన 170+ పరుగుల తేడా కరిగిపోయింది. జాసన్ రాయ్ అవుటైన తర్వాత 16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన అభిషేక్ వర్మ, జేమ్స్ నీశమ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన మహ్మద్ నబీ 3, అబ్దుల్ సమద్ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరగా ప్రియమ్ గార్గ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

జాసన్ హోల్డర్ 1 పరుగుకి, రషీద్ ఖాన్ 9 పరుగులు, వృద్ధిమాన్ సాహా 2 పరుగులు చేసి అవుటైనా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న మనీశ్ పాండే... అద్భుత హఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు...

విజయానికి 42 బంతుల్లో 98 పరుగులు కావాల్సిన దశలో సన్‌రైజర్స్‌కి విజయావకాశాలు ఉన్నా, ఆ తర్వాత ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రాకుండా అడ్డుకుని, వికెట్లు పడగొట్టింది...

41 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసిన మనీశ్ పాండే నాటౌట్‌గా నిలవగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

click me!