అల్లుడి ఆటతీరుపై అఫ్రిది అసంతృప్తి.. ఆ సమయంలో బుర్ర ఉపయోగించాలి కదా అంటూ ఫైర్.. పిల్లనిస్తాడా..? లేదా..?

First Published Nov 13, 2021, 12:05 PM IST

T20 World Cup 2021: సెమీస్ లో తనకు కాబోయే అల్లుడు షహీన్ షా అఫ్రిది ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక సమయంలో బుర్ర ఉపయోగించి ఆడాలి కదా..? అంటూ ఫైర్ అయ్యాడు. 

టీ20 ప్రపంచకప్ లో అపజయమెరుగని జట్టుగా సెమీస్ కు చేరిన పాకిస్థాన్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా మీద ఓడిన విషయం తెలిసిందే. అయితే  సూపర్-12 లో ఆ జట్టు అద్భుత విజయాలు సాధించడానికి కారణమైన పాకిస్థాన్ పేస్ సంచలనం షహీన్ షా అఫ్రిదియే.. సెమీస్ లో ఆ జట్టు ఓటమికి బాధ్యుడయ్యాడు.

షహీన్ షా అఫ్రిది వేసిన 19వ ఓవర్ చివరి మూడు బంతులకు ఆసీస్ వెటరన్ మాథ్యూ వేడ్.. సిక్సర్లు కొట్టడంతో ఆ జట్టు సంచలన విజయంతో ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అయితే అఫ్రిది ప్రదర్శనపై అతడికి కాబోయే మామ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది హ్యాపీగా లేడు. 

కీలక సెమీస్ మ్యాచ్ లో అల్లుడి ప్రదర్శనపై అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. హసన్ అలీ.. వేడ్ ఇచ్చిన క్యాచ్ మిస్ చేసినా తర్వాత వేసే బంతులైనా బాగా వేయొచ్చు కదా..? అని అల్లుడిపై ఫైర్ అవుతున్నాడు. కాస్త బుర్ర ఉపయోగించి ఉంటే ఇంకా మంచి బౌలింగ్ చేసేవాడంటూ తనవాళ్ల దగ్గర వాపోయాడు. 

అఫ్రిది వేసిన 19వ ఓవర్ మూడో బంతిని హసన్ అలీ నేల పాలు చేశాడు. ఆ తర్వాత వేడ్.. మూడు  సిక్సర్లతో ఆసీస్ ను ఫైనల్స్ కు చేర్చాడు. అయితే  ఇదే విషయమై అఫ్రిది ఘాటుగా స్పందించాడు. 

‘సరే.. హసన్ అలీ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఒకవేళ అతడు పట్టి ఉంటే ఏం జరిగేది. కొత్త బ్యాట్స్మెన్ వచ్చేవాడు. అంతే. కానీ అలీ క్యాచ్ మిస్ చేయడం వల్లే అఫ్రిది విఫలమవ్వడమనేది  కరెక్ట్ కాదు.. 

అతడు (షహీన్) మంచి పేస్ బౌలర్. కానీ నేను అఫ్రిది  ప్రదర్శనపై సంతోషంగా లేను. అలీ క్యాచ్ జారవిడిచినంత మాత్రానా.. నువ్వు (షహీన్) తర్వాత చెత్త బంతులు వేయాలని కాదు కదా. ఈ సమయంలో కాస్త బుర్ర ఉపయోగించి ఉంటే సరిపోయేది.

ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆవల బంతులు వేసి ఉన్నా.. కచ్చితత్వంతో యార్కర్లు వేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమో..’ అని అఫ్రిది అన్నాడు. 

అంతేగాక.. ‘ఈ టోర్నీలో అఫ్రిది బాగా రాణించాడు. నా కెరీర్ లో  కొత్త బంతితో వసీం భాయ్ (వసీం అక్రమ్), మహ్మద్ అమీర్ లు మాత్రమే ఇలా బౌలింగ్ చేయడం చూశా. గ్రూప్  స్టేజీలో అతడు మంచి  పెర్ఫార్మెన్స్  చేశాడు. అయితే ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుంటున్నాడు. దీని ద్వారా అనుభవం గడిస్తాడని అనుకుంటున్నా. భవిష్యత్తులో బాగా రాణిస్తాడని ఆశిస్తున్నా..’ అని చెప్పాడు. 

కాగా.. షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సా అఫ్రిదీని షహీన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. మరి ఈ ఓటమి ప్రభావం మామా-అల్లుళ్ల సంబంధాలపై ఏ మేర ప్రభావం చూపుతుందో అని పాకిస్థాన్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

click me!