నాకు రెస్ట్ ఇస్తే, రంజీ ట్రోఫీ ఆడతా! లేకుంటే టీమిండియాకి ఆడతా! రంజీ ఆడనున్న సూర్యకుమార్ యాదవ్...

First Published Dec 5, 2022, 3:44 PM IST

రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక, టీమిండియా ప్లేయర్లు పిక్‌నిక్‌కి వచ్చినట్టుగా అప్పుడప్పుడూ టీమ్‌లోకి వచ్చి... రెండు మూడు మ్యాచులు ఆడి మళ్లీ రెస్ట్ పేరుతో వెళ్లిపోతున్నారు. 2022 ఏడాదిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ... ఇలా స్టార్ ప్లేయర్లు ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచులే ఎక్కువ. అయితే సూర్యకుమార్ యాదవ్ చాలా స్పెషల్...

ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన సిరీసుల్లో కూడా పాల్గొన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి అదరగొట్టాడు...
 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అండ్ కో విశ్రాంతి తీసుకుంటే... సూర్యకుమార్ యాదవ్ మాత్రం న్యూజిలాండ్ టూర్‌కి వెళ్లాడు. కివీస్ టూర్‌లో న్యూజిలాండ్‌పై టీ20 సెంచరీ బాదిన సూర్య... వన్డే సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు...

Suryakumar Yadav

బంగ్లాదేశ్ పర్యటనతో ఈ ఏడాది టీమిండియా షెడ్యూల్ ముగుస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో సిరీస్ ఆడుతోంది భారత జట్టు. నెల రోజుల బ్రేక్ దొరకడంతో కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడేమోననుకుంటే తాను మాత్రం క్రికెట్ ఆడకుండా ఉండలేనని అంటున్నాడు సూర్యకుమార్ యాదవ్...

Suryakumar Yadav

డిసెంబర్ 13 నుంచి రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ప్రకటించిన ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కి కూడా చోటు దక్కింది. ‘రంజీ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని సూర్య, మాకు చెప్పాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం...’ అంటూ ప్రకటించాడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అజింకా నాయక్...  తొలి మ్యాచ్‌కి దూరంగా ఉండే సూర్య, రెండో మ్యాచ్ నుంచి టీమ్‌తో కలవబోతున్నాడు.

ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 77 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 44.01 సగటుతో 5326 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరుపున టెస్టుల్లో ఆరంగ్రేటం చేయాలని చూస్తున్న సూర్య, రంజీ ట్రోఫీలో ఆడి సెలక్టర్లను ఆకర్షించాలని భావిస్తున్నాడట...

రంజీ ట్రోఫీకి ముంబై జట్టు: అజింకా రహానే (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అర్మాన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, సావెద్ పార్కర్, హార్ధిక్ తమోరే, ప్రసాద్ పవర్, శామ్స్ ములానీ, తనుష్ కొట్టియన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ, సిద్ధార్థ్ రౌత్, రోయస్తాన్ దియాస్, సూర్యాంశ్ సెగ్దే, శశాంక్ అత్తర్దే, ముశీర్ ఖాన్

దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్న పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లతో పాటు అజింకా రహానేకి ఈ రంజీ ట్రోఫీ సీజన్ చాలా కీలకంగా మారనుంది...

click me!