40 ఓవర్ల దాకా మ్యాచ్ మనదే.. కానీ.. బంగ్లాతో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్ కామెంట్స్

First Published Dec 5, 2022, 2:25 PM IST

INDvsBAN ODI: బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో భారత్  అనూహ్య ఓటమి పాలైంది.  9 వికెట్లు తీసిన భారత బౌలర్లు ఒక్క వికెట్ తీయలేక చతికిలపడటంతో   టీమిండియాకు ఓటమి తప్పలేదు.  

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు తమ తొలి వన్డేలో ఓడటం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. విజయానికి  దగ్గరగా వచ్చిన  టీమిండియా.. ఒక్క వికెట్ తీయలేక  దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.  బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు విజృంభించడంతో భారత్ కు ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు వచ్చినా చివర్లో మెహిది హసన్ మిరాజ్ మెరుపులతో బంగ్లాదేశ్ అనూహ్య విజయం సాధించింది. 

అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపై   టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి  మ్యాచ్ లో 40 ఓవర్ల వరకు భారత్ నియంత్రణలోనే ఉందని  కానీ చివర్లో  ఒత్తిడిని తట్టుకోకపోవడంతో ఓటమి తప్పలేదని  తెలిపాడు. 

కైఫ్ మాట్లాడుతూ.. ‘ఇది ముమ్మాటికీ భారత్ గెలవాల్సిన మ్యాచ్. మన బౌలర్లు 9 వికెట్లు తీశారు.  బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది.  బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు సమిష్టిగా రాణించి  భారత్ ను పోటీలోకి తెచ్చారు.  వాస్తవానికి 40 ఓవర్ల దాకా మ్యాచ్ భారత్ నియంత్రణలోనే ఉంది. 

కానీ చివరి పది ఓవర్లలో భారత్ ను ఆదుకునే డెత్ బౌలర్ ఎవరు..?  అది దీపక్ చాహరా..? కుల్దీప్ సేనా..? ఈ విషయంలో భారత్ కు స్పష్టత ఉండాలి. ఈ మ్యాచ్ లో కొన్ని క్యాచ్ లు మిస్ చేశాం.  43వ ఓవర్లో  కెఎల్ రాహుల్ క్యాచ్ మిస్ చేయడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసినా అతడు మంచి ఫీల్డర్ అన్న విషయం మరువరాదు. 

ఇటీవలే ముగిసిన టీ20  ప్రపంచకప్ లో రాహుల్..  బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ ను  అద్భుతంగా రనౌట్ చేసిన విషయాన్ని మరువరాదు. వాషింగ్టన్ సుందర్  క్యాచ్ కోసం యత్నిస్తే బాగుండేది.  ముందుకు డైవ్ చేసినా  బంతి అందేది..’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.  

ఈ మ్యాచ్ లో భారత్ ఒత్తిడికి చిత్తయ్యిందని అందుకే చివర్లో తడబడిందని కైఫ్ తెలిపాడు. కెప్టెన్సీ, బౌలింగ్ మార్పుల గురించి మాట్లాడినా ప్రయోజనం లేదని,  40 ఓవర్ల దాకా భారత్ నియంత్రణలో ఉన్న మ్యాచ్ ను  హసన్ మిరాజ్  తర్వాత బంగ్లా వైపునకు మలుపు తిప్పాడని  కైఫ్ తెలిపాడు. చివర్లో ఎలా ఆడాలో హసన్  బంగ్లాదేశ్ బ్యాటర్లకు  చూపించాడని  కైఫ్ కొనియాడాడు. 

click me!