ఒకే ఒక్క ఫిఫ్టీ.. ‘బాబర్ సామ్రాజ్యాన్ని’ కూల్చి అగ్రపీఠం అదిరోహించడానికి సూర్యకు గోల్డోన్ ఛాన్స్..!

First Published Aug 6, 2022, 10:45 AM IST

ICC Men's T20I Rankings: ప్రస్తుతం ఐసీసీ టీ20 పురుషుల ర్యాంకింగ్స్ లో  పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ హవా కొనసాగుతున్నది. కానీ అతడి ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి మిస్టర్ 360 దూసుకొస్తున్నాడు. 

టీమిండియా నయా ఓపెనర్, ప్రస్తుతం ఐసీసీ టీ20 పురుషుల ర్యాంకింగ్స్ లో  రెండో స్థానంలో ఉన్న  సూర్యకుమార్ యాదవ్ అగ్రపీఠాన్ని చేరుకునే సమయం ఆసన్నమైంది. నేటి రాత్రి వెస్టిండీస్ తో ఫ్లోరిడా వేదికగా జరిగే నాలుగో టీ20లో యాభై పరుగులు చేస్తే చాలు.. ‘బాబర్ సామ్రాజ్యం’ కుప్పకూలడం పెద్ద విషయమేమీ కాదు. 

ప్రస్తుతం ఐసీసీ టీ20 పురుషుల ర్యాంకింగ్స్ లో  పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ హవా కొనసాగుతున్నది. మూడు ఫార్మాట్లలో ఒకనాటి కోహ్లీ వలే చెలరేగుతున్న అతడు.. ప్రస్తుతం 818 పాయింట్లతో పొట్టి ఫార్మాట్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 

బాబర్ తర్వాత రెండో స్థానంలో 816 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్  ఉన్నాడు. అయితే అతడు బాబర్ ను అధిగమించడానికి ఇదే మంచి తరుణం. ప్రస్తుతానికి పాకిస్తాన్ కు టీ20 మ్యాచులు లేవు. మళ్లీ ఆసియా కప్ దాకా ఆ జట్టు టీ20 మ్యాచులు ఆడదు. కానీ సూర్య విండీస్ తో నేటి మ్యాచ్ తో పాటు మరో మ్యాచ్ కూడా ఆడతాడు. 

నేటి మ్యాచ్ లో  సూర్య హాఫ్ సెంచరీ చేస్తే అతడికి రేటింగ్ పాయింట్లు పెరుగుతాయి.  హాఫ్ సెంచరీ చేయకున్నా  భారత్ రెండో సారి బ్యాటింగ్ చేస్తూ సూర్య కనీసం 35 నుంచి 40 పరుగులు చేసినా రేటింగ్ పాయింట్లు మెరుగవుతాయి.  తద్వారా  సూర్య.. బాబర్ ను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటాడు. 

సాధారణంగా  రేటింగ్ పాయింట్స్ ను ఎలా లెక్కిస్తారంటే.. ఒక జట్టు మొదటిసారి బ్యాటింగ్ చేసేటప్పటికంటే రెండో సారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సదరు ఆటగాడు బాగా ఆడితే వాళ్లకు రేటింగ్ పాయింట్స్ ఎక్కువొస్తాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని.. కీలక ఇన్నింగ్స్ ఆడినవారికి మంచి రేటింగ్ పాయింట్స్ దక్కుతాయి. 

హై స్కోరింగ్ మ్యాచ్ కంటే లో స్కోరింగ్ మ్యాచ్ లోనే రేటింగ్స్ ఎక్కువగా సాధించవచ్చు. తక్కువ స్కోరును ఛేదించే క్రమంలో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు ఇబ్బందుల్లో మంచి ఇన్నింగ్స్ ఆడేవారికి ఎక్కువ రేటింగ్ పాయింట్స్ వస్తాయి.  

అదీగాక బలమైన జట్టు మీద ఆడేప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లకు,  ఆ క్రమంలో నాటౌట్ గా నిలిచేవారికి బోనస్ పాయింట్లు కూడా లభిస్తాయి.  దీని ప్రకారం చూసుకుంటే.. నేటి మ్యాచ్ లో సూర్య సాధారణంగా తొలుత బ్యాటింగ్ చేస్తే ఫిఫ్టీ చేస్తే చాలు.  లేదంటే 30 బంతుల్లో 40 పరుగులు చేసినా చాలు (జట్టు కష్టాల్లో ఉండాలి). అలాకాక ఛేజింగ్ లో 40 పరుగులు చేస్తే ఇంకా బెటర్.  

సూర్య నాలుగో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడకున్నా ఐదో మ్యాచ్ కూడా ఉంది. ఆ మ్యాచ్ లో  సూర్య విజృంభించినా బాబర్ అగ్రపీఠం దిగిపోవాల్సిందే. ఐసీసీ  టీ20 ర్యాకింగ్స్ లో అగ్రస్థానం మీద మన సూర్య భాయ్ పేరు ఉండాల్సిందే. మరి మిస్టర్ 360 ఏం చేస్తాడో చూడాలి. ఆకాశమే హద్దుగా  చెలరేగితే ఇంకా  ఆ ఆనందానికి అవధులుండవు. 

click me!