Abhishek Sharma century
Abhishek Sharma: విధ్వంసం, విస్పోటనం, పరుగుల సునామీ.. ఇలా అన్ని ఉప్పల్ స్టేడియంలో చూపించారు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్టేయర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. వచ్చిన బాల్ ను వచ్చినట్టుగా ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టారు. క్రీజులోకి వచ్చిన వెంటనే పంజాబ్ కింగ్స్ బౌలర్లపై దాడికి దిగారు.
ఊరమాస్ బ్యాటింగ్ తో పంజాబ్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ట్రావిస్ హెడ్ ధనాధన్ ఆటతో హాఫ్ సెంచరీ కొట్టగా, యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ స్టేడియాన్ని షేక్ చేస్తూ తన తొలి ఐపీఎల్ సెంచరీ బాదాడు.
తన సెంచరీ తర్వాత సెలబ్రేషన్స్ కూడా అదిరిపోయేలా చేసుకున్నాడు అభిషేక్ శర్మ. ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ తన సెంచరీని అంకితం చేస్తూ తాను ఆడబోయే నాక్ నోట్ ను ముందు రాసుకొచ్చాడు అంటే అభిషేక్ శర్మ ఎలా గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
Abhishek Sharma century
ఉప్పల్లో కొడితే తుప్పలు దాటి పంజాబ్ లో పడేలా సెంచరీ సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ
ఐపీఎల్ 2025 మ్యాచ్ 27వ మ్యాచ్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు, ప్రభుసిమ్రాన్ 42 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు.
246 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు అదరిపోయే ఆరంభాన్ని అందించారు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ సూపర్ నాక్ తో 7 ఓవర్లలోనే హైదరాబాద్ టీమ్ 93 పరుగులు చేసింది. 10 ఓవర్లలో 143/0 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్ 2025లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలిచింది. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సెంచరీ కొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో 6వ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. మొత్తంగా తన 141 పరుగుల ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు.
Abhishek Sharma century
ఐపీఎల్ 2025లో భారీ సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ
తన సునామీ సెంచరీ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ సిక్సర్ల మోత మోగించాడు. ఏకంగా 10 సిక్సర్లు బాదాడు. ఇందులో భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. మార్కో జాన్సన్ బౌలింగ్ లో 10 ఓవర్ లో రెండు భారీ సిక్సర్లు, అద్భుతమైన రెండు ఫోర్లు కొట్టాడు. ఈ సిక్సర్లలో ఒకటి ఏకంగా 106 మీటర్ల దూరంలో పడింది. ఇది ఈ ఐపీఎల్ లో బిగ్గెస్ట్ సిక్సర్ గా రికార్డు సాధించింది.
Abhishek Sharma century records
అలాగే, ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 141 పరుగులతో 3వ ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. మొదటి రెండు స్థానాల్లో క్రిస్ గేల్ 175* పరుగులు, బ్రెండన్ మెకల్లమ్ 158* పరుగులతో ఉన్నారు. ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు.
అలాగే, ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఇండియన్ ప్లేయర్ గా అభిషేక్ శర్మ రికార్డు సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలో మూడో అత్యధిక స్కోరు. ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మలు 171 పరుగుల భాగస్వామ్యంతో ఐపీఎల్ 2025లో అత్యధికంగా నిలిచింది.
Abhishek Sharma century
ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. మొత్తంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ల ఇన్నింగ్స్ లతో 18.3 ఓవర్లలోనే 247/2 పరుగులతో హైదరాబాద్ టీమ్ విజయం సాధించింది. ఇది ఐపీఎల్ హిస్టరీలో రెండో అత్యధిక ఛేజ్ గా నిలిచింది.