రోహిత్ శర్మకు బాగా కలిసొచ్చిన 2021... ఆ మూడు కోరికలను తీర్చుకున్న హిట్ మ్యాన్...

First Published Dec 19, 2021, 12:27 PM IST

క్రికెట్‌లో టీమిండియాకి ఈ ఏడాది ఐసీసీ టోర్నీల్లో పెద్దగా కలిసి రాకపోయినా, ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. విరాట్ కోహ్లీకి కలిసి రాని 2021, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు మాత్రం బాగా కలిసి వచ్చింది...

ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడి ఆస్ట్రేలియా టూర్‌లో వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన రోహిత్, టెస్టు సిరీస్‌ మధ్యలో జట్టుతో కలిశాడు. సిడ్నీ టెస్టులో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 26, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులతో రాణించాడు...

గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులతో విఫలమైనా, తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. విదేశాల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డు లేని రోహిత్ శర్మకు ఈ సిరీస్ ఆత్మవిశ్వాసాన్ని నింపింది...

ఆస్ట్రేలియా టూర్ చేరుకున్న తర్వాత రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ వంటి యువ క్రికెటర్లతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు రోహిత్ శర్మ. కరోనా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినా, అందులో నిజం లేదని తేల్చి చెప్పాడు రోహిత్...

ఆ తర్వాత చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో  161 పరుగులు చేసి అదరగొట్టాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది టెస్టుల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ... ఇదే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఓవల్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేసిన రోహిత్ శర్మ, విదేశాల్లో మొట్టమొదటి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. ఈ ఏడాదికి ముందు విదేశాల్లో రోహిత్ సగటు కేవలం 27 మాత్రమే...

అయితే ఈ ఏడాది విదేశాల్లో రోహిత్ టెస్టు సగటు నమోదవ్వడమే కాదు, ఎన్నో ఏళ్లుగా అతని కెరీర్‌లో లోటుగా మిగిలిపోయిన ఫారిన్ టెస్టు సెంచరీ కూడా వచ్చేసింది...

అంతేకాదు ఎన్నో ఏళ్లుగా టీమిండియా కెప్టెన్సీని ఆశిస్తున్నాడు రోహిత్ శర్మ. 2018లో ఆసియా కప్‌ గెలిచిన సమయంలో ఈ విషయాన్ని ప్రకటించాడు రోహిత్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తొలిసారి పూర్తి స్థాయి భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు రోహిత్ శర్మ...

వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా రోహిత్ శర్మకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో వైట్ బాల్ కెప్టెన్‌గా రోహిత్ వ్యవహరించనున్నాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, ఈ ఏడాది మాత్రం తన జట్టు ముంబై ఇండియన్స్‌ని ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ కూడా చేర్చలేకపోయాడు...

నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ఐదో స్థానానికి పరిమితమైన ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. అయితే ఆ ప్రభావం ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్‌పై పెద్దగా పడదు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ రోహిత్ శర్మ ప్లేయర్‌గా పూర్తిస్థాయిలో రాణించలేకపోయాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులు చేసి విఫలమయ్యాడు...

కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం 150కి పైగా పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు రోహిత్ శర్మ...

click me!