రిటైర్మెంట్ ప్రకటించిన డేల్ స్టెయిన్... ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి...

First Published Aug 31, 2021, 4:18 PM IST

సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్, అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల డేల్ స్టెయిన్, ఈ తరంలో గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన స్టెయిన్, తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు...

టెస్టు గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన డేల్ స్టెయిన్, తన కెరీర్‌లో 93 టెస్టులు ఆడి 439 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 26 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు, ఐదు సార్లు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టాడు... 

125 వన్డేలు ఆడిన డేల్ స్టెయిన్, 196 వికెట్లు పడగొట్టాడు. 47 టీ20 మ్యాచుల్లో 64 వికెట్లు తీశాడు... మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 699 వికెట్లు తీసిన డేల్ స్టెయిన్, 700 వికెట్ల క్లబ్‌లో చేరడానికి ఒక్క వికెట్ దూరంలో క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు...

ఐపీఎల్ 2008లో ఆర్‌సీబీ తరుపున ఆడిన డేల్ స్టెయిన్, మొదటి మూడు సీజన్లు రాయల్ ఛాలెంజర్స్‌కే ఆడాడు. ఆ తర్వాత డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్‌ జట్లకి ఆడాడు...

‘20 ఏళ్లుగా ట్రైయినింగ్, మ్యాచులు, ప్రయాణం, విజయాలు, ఓటములు, ఉత్సాహం, ఆనందం, విరిగిన కాలు, జెట్ లాగ్... ఎన్నో మధురమైన అనుభూతులను నాకు మిగిల్చిందీ క్రికెట్...

ఎందరికో ధన్యవాదాలు తెలపాలి. కాబట్టి అందర్నీ కలిపి ఎక్స్‌పర్ట్స్‌ అని చెబుతున్నా. నా ఫెవరెట్ బ్యాండ్, ది కౌంటింగ్ క్రోస్... నేడు అధికారికంగా నేనెంతో ప్రేమించే క్రికెట్‌కి వీడ్కోలు తెలుపుతున్నా...’ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు డేల్ స్టెయిన్...

డేల్ స్టెయిన్‌ రిటైర్మెంట్‌పై స్పందించిన ఏబీ డీవిల్లియర్స్... ‘గ్రేట్ ప్లేయర్, గ్రేట్ మ్యాన్... అద్భుతమైన అనుభవాలు... నీకోసం ఓ మంచి సాంగ్‌ అంకితమిస్తా... లెజెండ్ ఫరెవర్’ అంటూ కామెంట్ చేశాడు...

2005లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన డేల్ స్టెయిన్ 2008లో ఆరో ర్యాంకుకి, 2009లో రెండో ర్యాంకుకి చేరాడు. 2010 నుంచి 2013 వరకూ టాప్ ర్యాంకులో కొనసాగిన డేల్ స్టెయిన్, 2014లో రెండో ర్యాంకుకి పడిపోయినా... 2015లో తిరిగి టాప్‌లోకి దూసుకొచ్చాడు...

2343 రోజుల పాటు ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన డేల్ స్టెయిన్, నిర్విరామంగా అత్యధిక రోజులు నెం.1 బౌలర్‌గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

ఐపీఎల్‌లో పాటు పాక్ సూపర్ లీగ్, కరేబియర్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్ వంటి ఎన్నో విదేశీ లీగుల్లో పాల్గొన్న డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌తో ఓ శకం ముగిసినట్టైంది...

click me!