ఆ బంతి గనక తిరిగుంటే.. నేను రిటైర్మెంట్ ప్రకటించేవాడిని.. : పాక్‌తో మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ ఆడటంపై అశ్విన్

First Published | Oct 28, 2022, 5:27 PM IST

T20 World Cup 2022: భారత్ - పాకిస్తాన్  మధ్య మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో చివరి  ఓవర్లో హైడ్రామా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆఖరి బంతికి ఫోర్ కొట్టిన అశ్విన్.. టీమిండియాకు విన్నింగ్ షాట్ కొట్టాడు. 
 

పొట్టి ప్రపంచకప్ లో భాగంగా ఇటీవలే భారత్-పాక్ మధ్య  ముగిసిన మ్యాచ్ లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో విరాట్ వీరోచిత పోరాటంతో  టీమిండియాకు చిరస్మరణీయ విజయం దక్కింది. అయితే ఈ మ్యాచ్ లో  ఒక బంతికి రెండు పరుగులు  చేయాల్సి ఉండగా క్రీజులోకి వచ్చిన అశ్విన్.. తాజాగా ఆ మ్యాచ్ కు సంబంధించి ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. 

పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన ఆఖరి బంతి లెగ్ సైడ్ దిశగా  వెళ్లింది.  అది వైడ్ గా వెళ్తుండటంతో  అశ్విన్ దానిని వదిలేశాడు.  దాంతో స్కోర్లు సమమయ్యాయి. చివరి బంతికి అశ్విన్..  ఫోర్ కొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే నవాజ్ వేసిన బంతి  వైడ్ కాకుండా తిరిగి ఉంటే ఏమయ్యేది..? అన్న ప్రశ్నకు అశ్విన్  ఆసక్తికర సమాధానమిచ్చాడు. 


ఇదే విషయమై అశ్విన్ తాజాగా భారత మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్ తో జరిపిన సంభాషణలో  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ మ్యాచ్ కు సంబంధించిన మ్యాచ్ విశేషాలపై ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. 

ఈ సందర్బంగా అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో నేను బ్యాటింగ్ కు వెళ్లేప్పుడు బ్లాంక్ మైండ్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాను.  బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడని కోహ్లీని అడిగాను. అప్పుడు కోహ్లీ నా ఫేవరేట్ షాట్ కొట్టు పర్లేదు అని చెప్పాడు. 

అయితే మ్యాచ్ గెలిచాం కాబట్టి సరిపోయింది గానీ ఒకవేళ నవాజ్ వేసిన ఆ బంతి వైడ్ గా కాకుండా టర్న్ అయి ప్యాడ్ కు తాకడమో లేక పరుగులు రాకపోవడమో అయితే నువ్వు ఏం చేసేవాడివని అడిగారు.

నేను వారితో.. ఏం లేదు. వెంటనే అక్కడ్నుంచి  డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయి  నా ఫోన్ లో ట్విటర్ ఓపెన్ చేసి ‘ఇన్నాళ్లు నన్ను ఆదరించిన అభిమానులకు, బీసీసీఐకి ధన్యవాదాలు.. ఈ ప్రయాణం చాలా గొప్పది.. ఇక గుడ్ బై’ అని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించేవాడిని..’ అని  అశ్విన్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. 

అశ్విన్ ఆటను కోహ్లీ కూడా మెచ్చుకున్నాడు.  సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో వైడ్ బంతిని కూడా బాదడానికి చూసే బ్యాటర్లు.. వదిలిపెట్టడం చాలా గొప్ప విషయమని, అశ్విన్ కు డబుల్ దిమాక్ ఉందని  కోహ్లీ కొనియాడాడు.  

Latest Videos

click me!