సెంచ‌రీల మోత మోగిస్తున్న స్మృతి మంధాన.. మ‌రో స‌రికొత్త రికార్డు

First Published | Jun 19, 2024, 10:13 PM IST

India vs South Africa - smriti mandhana : సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో స్మృతి మంధాన సెంచ‌రీ కొట్టింది. ఆమెకు ఇది ఏడో సెంచరీ. వన్డేల్లో ఏడు సెంచరీలతో మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. 
 

India , smriti mandhana,

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన సెంచరీతో అద‌ర‌గొట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కూడా 117 పరుగుల సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడారు. 

ఇప్పుడు వరుసగా రెండో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించారు. స్మృతి మంధాన 120 బంతుల్లో 18 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్‌తో పాటు కెప్టెన్ హరన్‌ప్రీత్ కౌర్ కూడా సెంచరీతో మెరిసింది. ఆమె 88 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచారు. 


ఈ రెండు సెంచరీలతో భారత మ‌హిళా జ‌ట్టు 50 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. దీంతో భార‌త్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో భారత్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్మృతి మంధాన వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా, ఓవరాల్‌గా 10వ మహిళా క్రికెట‌ర్. ఈ 10 మంది ఆటగాళ్లు కలిసి ఇలా 11 సార్లు చేశారు. మంధాన కంటే ముందు, అమీ సటర్త్‌వైట్, జిల్ కెన్నారే, డెబోరా హాకీ, కెఎల్ రోంటన్, మెగ్ లానింగ్, టామీ బ్యూమాంట్, అలిస్సా హీలీ, నేట్ షీవర్ బ్రంట్, ఎల్ వోల్వార్డ్ లు వ‌రుస‌గా  సెంచ‌రీలు సాధించారు. 

స్మృతి మంధాన వన్డే కెరీర్‌లో ఇది ఏడో సెంచరీ. వన్డేల్లో ఏడు సెంచరీల దిగ్గజం మిథాలీ రాజ్‌ రికార్డును సమం చేసింది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రీడాకారిణిగా మిథాలీతో సమంగా నిలిచింది. అలాగే మంధాన 84 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఈ ఏడు సెంచరీలు చేయడం గమనార్హం. మిథాలీ 211 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడి ఏడు సెంచ‌రీలు కొట్టారు. మంధాన 136 పరుగుల ఇన్నింగ్స్ భారత గడ్డపై వన్డేల్లో భారత మహిళా క్రీడాకారిణి చేసిన అత్యధిక స్కోరు కావ‌డం విశేషం.

భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వ‌న్డే సెంచ‌రీలు చేసిన మ‌హిళా క్రికెట‌ర్లు 

స్మృతి మంధాన - 7
మిథాలీ రాజ్    - 7
హర్మన్‌ప్రీత్ కౌర్ -    6
పూనమ్ రౌత్    - 3

Latest Videos

click me!