ఆ పాక్ మాజీ కెప్టెన్, నాకు లంచం ఇవ్వాలని చూశాడు... ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ కామెంట్స్...

First Published Jan 18, 2022, 12:42 PM IST

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. కరాచీలో జరిగిన టెస్టులో తనకి లంచం ఆశ చూపించాడని ఆరోపణలు చేశాడు...

టెస్టు క్రికెట్‌లో 708 వికెట్లు తీసిన షేన్ వార్న్, పాకిస్తాన్‌పై 90 వికెట్లు తీశాడు. ఇందులో ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌పై 45 వికెట్లు తీయగా, పాకిస్తాన్‌లో 18, యూఏఈలో 16, శ్రీలంకలో 11 వికెట్లు తీశాడు...

తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1994లో జరిగిన ఓ సంఘటన గురించి బయటపెట్టాడు షేన్ వార్న్... ‘1994లో నేను, టీమ్ మే కలిసి పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ ఆడేందుకు కరాచీలో హోటల్ రూమ్‌లో ఉన్నాం...

అప్పుడు పాక్ కెప్టెన్ మాలిక్ మాకు ఫోన్ చేశాడు, నిన్ను కలవాలని చెప్పాడు. అప్పటికీ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ముగిసింది. మేం మరో 7 వికెట్లు తీస్తే మ్యాచ్ గెలుస్తాం...

ఆఖరి రోజు పాకిస్తాన్ గెలవాలంటే మరో 160 పరుగులు కావాలి. మేం ఈజీగా గెలుస్తామనే ధీమాతో ఉన్నాం. పిలిచాడు కదా అని అతని గదికి వెళ్లాను...

‘మ్యాచ్ బాగా జరుగుతోంది కదా’ అన్నాడు. నేను ‘అవును, మేం రేపు గెలిచేలా ఉన్నాం...’ అన్నాను. ‘అవును... మేం ఓడిపోలేం, పాకిస్తాన్‌లో మేం మ్యాచ్ ఓడిపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు..

మా ఇళ్లను కూల్చేస్తారు. మా కుటుంబాల ఇళ్లను తగులబెట్టేస్తారు... నాకేం చెప్పాలో తెలియడం లేదు... ’ అంటూ నాకు 2 మిలియన్ డాలర్లు ఇవ్వడానికి ప్రయత్నించాడు...

వికెట్లు తీయకుండా స్టంప్స్ దూరంగా బంతులు వేయాలని కోరాడు. నేను ఒక్కసారి షాక్ అయ్యాను. నేను అతన్ని తిట్టి, మేం మిమ్మల్ని ఓడించి తీరతాం...’ అని చెప్పి వెళ్లిపోయాను...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వార్న్...

ఆ సంఘటన తర్వాత తనతో ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపాడు వార్న్. పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్, 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధానికి గురైన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు...

ఈ సంఘటన తర్వాత తాను ఆసీస్ టెస్టు కెప్టెన్ మార్క్ టేలర్, కోచ్ బాబ్ సింప్సన్‌, రిఫరీ జాన్ రిడ్‌లతో ఈ విషయం గురించి చెప్పినట్టు తెలియచేశాడు షేన్ వార్న్..

అయితే 1994లో కరాచీ టెస్టులో పాకిస్తాన్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇంజమామ్ వుల్ హక్, ముస్తాక్ అహ్మద్ కలిసి ఆఖరి వికెట్‌కి 57 పరుగులు జోడించారు..

విజయానికి 3 పరుగులు కావాల్సిన దశలో ఆసీస్ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ, స్టంపింగ్ మిస్ చేయడం, ఆ బంతికి బైస్ రూపంలో నాలుగు పరుగులు కావడంతో పాకిస్తాన్ వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది...

‘ఆ మ్యాచ్ తర్వాత నేను పాక్ టీమ్ వైపు చూస్తూ ఉన్నాను. సలీమ్ మాలిక్ అక్కడ కూర్చొన్ని, నన్నే చూస్తూ ఉన్నాడు. నువ్వు డబ్బులు తీసుకుని ఉండాల్సింది... అనుకుంటున్నట్టు అతని ముఖం చూస్తేనే తెలుస్తోంది...’ అంటూ చెప్పాడు షేన్ వార్న్..

click me!