ఖర్చంతా నా అల్లుడిదేనా..? పీసీబీ ఒక్క రూపాయి కూడా ఇవ్వదా..? పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై షాహిద్ అఫ్రిది ఆగ్రహం

First Published Sep 16, 2022, 11:12 AM IST

Shaheen Afridi:పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది గాయం కారణంగా ఆసియా కప్ లో ఆడలేదు. ప్రస్తుతం అతడు లండన్ లో చికిత్స పొందుతున్నాడు.  అయితే తన అల్లుడిని పీసీబీ పట్టించుకోవడంలేదని.. 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై పాక్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది ఫైర్ అవుతున్నాడు.  కాబోయే అల్లుడు, పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది గాయానికి సంబంధించి.. పీసీబీ  వ్యవహరిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. షాహీన్  తన సొంత ఖర్చుతోనే   వైద్యం  చేయించుకుంటున్నాడని, పీసీబీ నయా పైసా కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. 

పాకిస్తాన్ లోని ఓ టీవీ ఛానెల్ తో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. ‘షాహీన్ తన సొంత ఖర్చుతో లండన్ కు వెళ్లాడు. విమానం టికెట్ ఖర్చులు కూడా అతడివే.  లండన్ లో షాహీన్ ఖర్చు పెడుతున్న ప్రతీ పైసా అతడిదే. షాహీన్ కోసం నేను అక్కడ నాకు తెలిసిన ఒక డాక్టర్ తో మాట్లాడాను. 

షాహీన్ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాడు. అతడి విషయంలో పీసీబీ వ్యవహరిస్తున్న తీరు ఏం బాగోలేదు. జట్టుకు ఎంతో సేవ చేస్తున్నా అతడిని మాత్రం పీసీబీ పట్టించుకోవడం లేదు.   పీసీబీ నుంచి జకీర్ ఖాన్ (పీసీబీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్) ఒక్కసారో.. రెండుసార్లో మాట్లాడాడు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 

షాహిద్ అఫ్రిది.. తన పెద్ద కూతురును షాహీన్ కు  ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉండే అవకాశాలున్నాయి. అయితే అల్లుడి వైద్యం కోసం మామ పరితపించిపోతుండటం గమనార్హం. 

ఇక శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత గాయంతో  ఆసియా కప్ కు దూరమైన షాహీన్.. త్వరలోనే ఇంగ్లాండ్ తో ప్రారంభం కాబోయే ఏడుమ్యాచ్ ల టీ20 సిరీస్ తో పాటు న్యూజిలాండ్ తో జరుగబోయే ట్రై సిరీస్ లో కూడా ఆడడం లేదు. 

కీలక బౌలర్ కావడంతో అతడు త్వరగా కోలుకోవాలని పీసీబీ కోరుకుంటుంది. ఈ మేరకు అతడు లండన్ లో చికిత్స తీసుకుంటున్నాడు.  టీ20 ప్రపంచకప్ ఉండటంతో అతడిని ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తో ఆడించకుండా  నేరుగా మెగా టోర్నీలోనే బరిలోకి దించాలని పాకిస్తాన్ భావిస్తున్నది. 

click me!