Shafali Verma: ఆసియా కప్ 2026 లో పాకిస్థాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ తో మహిళల టీ20 క్రికెట్‌లో షఫాలీ వర్మ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అతి పిన్న వయసులో, తక్కువ బంతుల్లో అరుదైన రికార్డు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మహిళల టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. శనివారం దుబాయ్ లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఆసియా కప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఆమె సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించింది. మహిళల టీ20ల్లో అత్యంత వేగంగా, అలాగే అతి చిన్న వయసులోనే 3,000 పరుగులు మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు 3000 పరుగుల రికార్డుకు కేవలం 7 పరుగుల దూరంలో ఉన్న షఫాలీ, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆ మైలురాయిని దాటేసింది.
25
పిన్న వయసులోనే అరుదైన రికార్డ్ సొంతం
షాఫాలీ వర్మ కేవలం 22 సంవత్సరాల 220 రోజుల వయసులోనే ఈ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన గేబీ లూయిస్ పేరిట ఉండేది. గేబీ లూయిస్ 24 సంవత్సరాల 347 రోజుల వయసులో 3,000 పరుగులు సాధించగా, షఫాలీ ఆమె రికార్డును తుడిచిపెట్టేసింది. ఈ జాబితాలో యూఏఈకి చెందిన ఈషా ఓజా (27 ఏళ్ల 139 రోజులు), టీమిండియా స్టార్ స్మృతి మంధాన (27 ఏళ్ల 171 రోజులు), వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ (27 ఏళ్ల 347 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2019లో 15 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున అరంగేట్రం చేసిన షఫాలీ, హర్మాన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన తర్వాత 3000 రన్స్ మైలురాయి దాటిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మొత్తంగా మహిళల టీ20ల్లో ఈ ఘనత సాధించిన 16వ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.
35
తక్కువ బంతుల్లో 3000 రన్స్ సాధించిన ప్లేయర్
వయసులోనే కాదు, ఎదుర్కొన్న బంతుల పరంగా కూడా షఫాలీ వర్మ ఫాస్టెస్ట్ రికార్డ్ నెలకొల్పింది. ఆమె కేవలం 2,182 బంతుల్లోనే 3,000 పరుగుల ఘనతను అందుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలిస్సా హీలీ 2,321 బంతుల్లో సాధించిన పాత రికార్డును షఫాలీ అధిగమించింది. పాకిస్థాన్ విసిరిన టార్గెట్ ఛేజింగ్‌లో షఫాలీ మొదటి బంతి నుంచే ఎటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసింది. సాదియా ఇక్బాల్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలచి, తదుపరి బంతికి సింగిల్ తీసి 3,000 పరుగుల రికార్డును పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఫాతిమా సనా బౌలింగ్‌లో ఒక ఫోర్ కొట్టి, 6 బంతుల్లో 12 రన్స్ (1 ఫోర్, 1 సిక్స్) చేసి ఫాతిమా సనాకే క్యాచ్ ఇచ్చి అవుటైంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టును భారత స్పిన్నర్లు తిప్పేశారు. పాక్ జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయి, మహిళల టీ20ల్లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. వికెట్ నష్టపోకుండా 27 రన్స్ చేసిన దశ నుంచి పాక్ ఇన్నింగ్స్ దారుణంగా కుప్పకూలింది. భారత స్పిన్నర్లు శ్రీ చరణి, ప్రేమ రావత్ చెరో 3 వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ వెన్నెముక విరిచారు. దీప్తి శర్మ 2 వికెట్లతో రాణించింది. దీంతో పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే చాపచుట్టేసింది.
55
గ్రూప్-ఎ లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా
56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించగా, దీప్తి శర్మ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఎ లో థాయిలాండ్, హాంగ్ కాంగ్, పాకిస్థాన్‌లపై గెలిచి మొత్తం 6 పాయింట్లతో (+5.471 నెట్ రన్‌రేట్) టేబుల్ టాప్‌లో నిలిచింది. ఇక గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ మధ్య సెమీఫైనల్ బెర్తుల కోసం పోటీ నెలకొంది.