వర్షం కోసమే సిరీస్ పెట్టినట్టుంది..! గ్రౌండ్‌లో కంటే డ్రెస్సింగ్ రూమ్‌లలోనే ఎక్కువగా గడిపిన క్రికెటర్లు..

First Published Nov 30, 2022, 4:43 PM IST

INDvsNZ:కివీస్  పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇక్కడకు వచ్చింది. కానీ ఈ రెండు సిరీస్ లలో ఆటగాళ్లు ఆడిన ఆట కంటే వరుణుడు ఆడిన ఆటే ఎక్కువగా ఉంది. 

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా  న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. సీనియర్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు లేకుండానే కివీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు టీ20లలో హార్ధిక్ పాండ్యా, వన్డే లలో శిఖర్ ధావన్  సారథ్యం వహించాడు.  
 

కివీస్  పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇక్కడకు రాగా అసలు క్రికెటర్లు ఆడిన క్రికెట్ కంటే వర్షమే ఎక్కువ సేపు  గ్రౌండ్ లో ఆధిపత్యం చెలాయించింది.  చూస్తుంటే  వర్షం కోసమే సిరీస్ పెట్టినట్టుగా ఉందని నెటిజన్లు వాపోతున్నారు.  సిరీస్ లో జరిగిన మ్యాచ్ లు, వర్షం అంతరాయం కలిగించిన సందర్భాలు చూస్తే అదే నిజమనిపించక మానదు. 

టీ20 సిరీస్ లో భాగంగా  తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. రెండో మ్యాచ్ ఒక్కటే సజావుగా సాగింది. ఈ మ్యాచ్ లో భారత్.. సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేయడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్  ప్రారంభానికి ముందు కూడా వర్షం అంతరాయం కలిగించింది. కానీ కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగడంతో మ్యాచ్ మొదలైంది. కివీస్ ఇన్నింగ్స్  ముగిసినా.. టీమిండియా బ్యాటింగ్ కు వచ్చి 9 ఓవర్లు ముగిసేసరికి మళ్లీ వాన  కురిసింది. 

మూడో టీ20 టైగా ముగియడంతో  టీ20 సిరీస్ ను భారత్ 1-0తో గెలుచుకుంది.  ఇక టీ20 సిరీస్ సజావుగా సాగకున్నా వన్డే సిరీస్ లో అయినా వరుణుడు కరుణిస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే  తొలి వన్డే సజావుగా సాగింది.  ఈ మ్యాచ్ లో 300 ప్లస్ టార్గెట్  ఉంచినా కివీస్ అవలీలగా ఛేదించి 1-0 ఆధిక్యం సాధించింది. 

ఇక రెండో వన్డే విషయానికొస్తే.. మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే వర్షం కురిసింది.  భారత్ 4 ఓవర్లు బ్యాటింగ్ చేసేసరికి వాన కురవగా కొద్దిసేపు మ్యాచ్ ను ఆపేశారు.  వర్షం కారణంగా మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. తిరిగి భారత్ బ్యాటింగ్ కు వచ్చి 12 ఓవర్లు ఆడింది.  కానీ మళ్లీ వరుణుడి రాకతో  మ్యాచ్ అర్థాంతరంగా ఆగింది. 

ఇక మూడో వన్డే అయినా సజావుగా సాగుతుందా..? లేదా..? అనే అనుమానాల నేపథ్యంలో క్రిస్ట్ చర్చ్ లో టాస్ కు ముందే వరుణుడు హాయ్ చెప్పి వెళ్లాడు. కొద్దిసేపు టైమ్ ఇవ్వడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.  పడుతూ లేస్తూ.. 47.3 ఓవర్లకు 219 పరుగులు చేసింది టీమిండియా.  లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన  కివీస్.. 18 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. కానీ  అప్పటికే చాలా లేట్ అయిందనుకున్నాడో ఏమో గానీ వరుణుడు ఆగమేఘాల మీద వచ్చి తన పని కానిచ్చేశాడు. అంతే.. ఒక్కసారి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన ఆటగాళ్లు తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టలేదు. 

ఫలితం తేలని ఈ మ్యాచ్ లో  సిరీస్ ఫలితం మాత్రం కివీస్ కు అనుకూలంగా వచ్చింది. తొలి మ్యాచ్ గెలిచినందుకు గాను న్యూజిలాండ్.. వన్డే సిరీస్ ను 1-0తో గెలుచుకుంది.  టీ20 సిరీస్ ను 1-0తో టీమిండియా నెగ్గింది. అయితే ఈ  రెండు సిరీస్ లలో విజయం మాత్రం వరుణదేవుడిదేనని, ఆయన కోసమే సిరీస్ పెట్టినట్టుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!