మీరు వరల్డ్ ఫేమస్ అవ్వాలంటే అది చేయండి : పాక్ క్రికెటర్లకు పీసీబీ చీఫ్ కీలక సూచన

First Published Nov 30, 2022, 3:56 PM IST

పాకిస్తాన్  క్రికెట్ జట్టు ఇటీవల ముగిసిన  టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. కానీ నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ ఈ రెండు జట్ల మధ్య టెస్టు సమరం జరుగనుంది. 

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు  ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా అదిరిపోయే సలహా ఇచ్చాడు. ప్రపంచమంతా ఆ జట్టును గుర్తించాలంటే తాను చెప్పినట్టు చేయాలని   సూచించాడు.  పాకిస్తాన్ లోని దేశవాళీ క్రికెట్ లో నిర్వహించిన  ఖైద్-ఈ-ఆజం ట్రోఫీ  ఫైనల్ విజేతకు  టైటిల్ అందజేసేందుకు గాను   విచ్చేసిన   రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు. 

రమీజ్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు ఆటగాళ్లందరికీ నేను ఒక్కటే మాట చెప్పాను.  మీరు ఆడుతున్నది  ప్రపంచ ఛాంపియన్లతో.. ఒకవేళ మీరు వరల్డ్ ఫేమస్ అవ్వాలంటే గనక   వారిని ఓడించండి. ఇంగ్లాండ్ ను ఓడిస్తే మీ గురించి  ప్రపంచ పత్రికలలో హెడ్ లైన్లు వేస్తారని చెప్పాను..’  అని తెలిపాడు. 

టీ20 ప్రపంచకప్ విజేత అయిన ఇంగ్లాండ్.. టెస్టులలో కూడా అదరగొడుతున్న విషయం తెలిసిందే. బెన్ స్టోక్స్ సారథిగా నియమితుడయ్యాక ఆ జట్టు ఆటతీరే మారింది. ‘దూకుడు’ మంత్రంగా అటాకింగ్ ఆటతో టెస్టు క్రికెట్ ను కూడా  రసవత్తరంగా మారుస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. ప్రపంచ క్రికెట్ లో అజేయ శక్తిగా ఎదుగుతోంది. దీంతో  ఆ జట్టును ఓడించాలని రమీజ్ రాజా తన క్రికెటర్లకు సూచించాడు. 

ఇక పాకిస్తాన్ లో డ్రాప్ ఇన్ పిచ్ (మరో చోట నుంచి పిచ్ లను తీసుకొచ్చి గ్రౌండ్ లో పెట్టడం) ల గురించి  రమీజ్ స్పందిస్తూ..   తాను ఆ సలహా ఇవ్వలేదని కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు దానికి బాగా అలవాటు పడ్డారని  అన్నాడు.

‘ఈ ఏడాది ఆస్ట్రేలియా జట్టు  పాకిస్తాన్ లో పర్యటించినప్పుడు  మేం కొత్తగా డ్రాప్ ఇన్ పిచ్ లను తీసుకొచ్చాం. అప్పుడు  అవి ఎలా స్పందిస్తాయనేది మాకు అనుమానంగా ఉండేది. కానీ ఇప్పుడు వాటికి బాగా అలవాటుపడ్డారు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో  బాగా రాణించగలరని నేను నమ్ముతున్నా..’ అని చెప్పాడు. 
 

ఈ ఏడాది  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు తమ దేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని, త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ పూర్వవైభవం సాధించే దిశగా తాము కృషి చేస్తున్నామని రమీజ్ తెలిపాడు.  భవిష్యత్ లో మరిన్ని పెద్ద జట్లు పాక్ పర్యటనకు వస్తాయని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. 
 

ఇదిలాఉండగా.. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. రావల్పిండి టెస్టు ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ టెస్టు టీమ్‌లోని ప్లేయర్లు, అంతుచిక్కని వైరస్ బారిన పడ్డారు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు 11 మంది టీమ్ ప్లేయర్లు అనారోగ్యానికి గురయ్యారు. టీమ్ ప్లేయర్లతో పాటు మరో ఇద్దరు సహాయక సిబ్బంది కూడా అనారోగ్యానికి గురి కావడం, పాక్‌లో ఉగ్రదాడులు జరుగుతుండడంతో ఇంగ్లాండ్ టీమ్ భయాందోళనలకు గురవుతోంది.

click me!