వాళ్లిద్దరికీ వయసైపోయింది.. విదేశీ పర్యటనలకు తీసుకెళ్తే అది మీకే నష్టం.. ఇంగ్లాండ్‌కు ఇయాన్ చాపెల్ సూచన

First Published Sep 27, 2022, 4:46 PM IST

England Cricket: ప్రస్తుతం అండర్సన్ వయసు 40 ఏండ్లు దాటింది.  స్టువర్ట్ బ్రాడ్ కు 36 ఏండ్లు. ఈ పేస్ ద్వయంలో అండర్సన్.. 175 టెస్టులాడి 667 వికెట్లు తీశాడు.  బ్రాడ్ విషయానికొస్తే.. 159 టెస్టులలో 566 వికెట్లు పడగొట్టాడు. 
 

గత దశాబ్దకాలానికి పైగా ఇంగ్లాండ్  బౌలింగ్ బాధ్యతలను మోస్తున్న పేస్ ద్వయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ పై  ఆస్ట్రేలియా  దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీళ్లిద్దరికీ వయసైపోయిన నేపథ్యంలో ఈ పేస్ ద్వయాన్ని విదేశీ సిరీస్ లకు తీసుకెళ్లకుండా ఉంటేనే మంచిదని తెలిపాడు. 

ఓ ఇంగ్లీష్  క్రీడా వెబ్‌సైట్ కు రాసిన కాలమ్ లో చాపెల్ స్పందిస్తూ.. ‘టెస్టులలో ఇంగ్లాండ్ కు ఇప్పుడు సరైన కెప్టెన్ (బెన్ స్టోక్స్) ఉన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు మంచి కాంబినేషన్ ను ఎంపిక చేసుకోవడం కెప్టెన్ కు ఉండాల్సిన గొప్ప లక్షణం. ఈ ఏడాది ప్రారంభంలో ముగిసిన యాషెస్ సిరీస్ లో ఓటమి తర్వాత వాళ్ల ఫలితాలు మెరుగయ్యాయనడంలో సందేహం లేదు. 

ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ కు పదే పదే ఓటములు ఎదురుకావడానికి ముఖ్య కారణం వాళ్ల పేస్ బౌలింగ్. ఆ జట్టు ఫస్ట్ ఛాయిస్ బౌలర్లుగా ఉన్న పలువురు బౌలర్లు (జోఫ్రా ఆర్చర్) యాషెస్ సిరీస్ లో ఆడకపోవడం వారిని దెబ్బతీసింది. 

కానీ  అదే సమయంలో ఇంగ్లాండ్ ఇప్పటికీ  పేస్ బౌలింగ్ అంటే జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ల మీదే ఆధారపడుతున్నది. వయసు మీద పడ్డా వీళ్లిద్దరినే కొనసాగిస్తున్నది. అదే ఇంగ్లాండ్ చేస్తున్న తప్పు.

ఇంగ్లాండ్ లో కుడి చేతి వాటం పేస్ బౌలర్లకు అక్కడి పిచ్ లు అనుకూలిస్తాయి. కానీ విదేశాలలో అలా కాదు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఉండేవి బౌన్సీ పిచ్ లు. ఇక్కడ బ్రాడ్, అండర్సన్ లు పెద్దగా రాణించలేరు. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్లకు ఇక్కడ వికెట్లు తీసే అవకాశముంటుంది..’ అని తెలిపాడు. 

యాషెస్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్.. వెస్టిండీస్ తో కూడా సిరీస్  ఓడింది. దీంతో జో రూట్  సారథ్య పగ్గాలను బెన్ స్టోక్స్ కు అప్పగించాడు. కొత్త కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్  మార్గదర్శకత్వంలో ఇంగ్లాండ్  టెస్టులలో దూసుకుపోతున్నది. 

అయితే స్టోక్స్, మెక్ కల్లమ్ లు వచ్చాక ఇంగ్లాండ్ ఇప్పటివరకు స్వదేశంలోనే సిరీస్ లు ఆడింది. జూన్ లో న్యూజిలాండ్ తో, జులైలో ఇండియాతో రీషెడ్యూల్ టెస్టు,  గతనెలలో సౌతాఫ్రికాతో ఆడింది. ఈ మూడు సిరీస్ లలో అండర్సన్, బ్రాడ్ లు కీలకంగా వ్యవహరించారు. 

ప్రస్తుతం అండర్సన్ వయసు 40 ఏండ్లు దాటింది.  స్టువర్ట్ బ్రాడ్ కు 36 ఏండ్లు.  రిటైర్మెంట్ గురించి బ్రాడ్ ఇంతవరకు ఏమీ చెప్పలేదు గానీ అండర్సన్ మాత్రం ఈ ఏడాది చివర్లో లేదా స్వదేశంలో ఆసీస్ తో జరిగే యాషెస్ సిరీస్ తర్వాత రిటైరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఈ పేస్ ద్వయంలో అండర్సన్.. 175 టెస్టులాడి 667 వికెట్లు తీశాడు.  బ్రాడ్ విషయానికొస్తే.. 159 టెస్టులలో 566 వికెట్లు పడగొట్టాడు. 

click me!