పద్మనాభస్వామిని దర్శించుకున్న సౌతాఫ్రికా క్రికెటర్.. భారతీయులకు నవరాత్రి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్

First Published Sep 27, 2022, 3:30 PM IST

IND vs SA T20I: ఇండియా-సౌతాఫ్రికాల మధ్య తిరువనంతపురంలో రేపు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత్ చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు ప్రాక్టీస్ లో నిమగ్నమైంది. కానీ ఆ జట్టు స్పిన్నర్ మాత్రం పద్మనాభస్వామి ఆలయానికి వచ్చాడు. 

Keshav Maharaj

టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఇటీవలే భారత్ కు చేరుకుంది. ఈ క్రమంలో సఫారీ ఆటగాడు కేశవ్ మహారాజ్  కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను  కేశవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈనెల 28 నుంచి మొదలుకాబోతున్న టీ20 సిరీస్ ఆడేందుకు గాను శనివారం  దక్షిణాఫ్రికా జట్టు త్రివేండ్రం (కేరళ) అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న విషయం తెలిసిందే.

మ్యాచ్ కు ముందు కేశవ్ మహారాజ్..  త్రివేండ్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి దర్శనానికి వెళ్లాడు.  పూర్తి భారతీయ సాంప్రదాయ వస్త్రాలు ధరించిన ఆయన.. దర్శనం చేసుకున్న తర్వాత బయట దిగిన ఫోటోను తన ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేశాడు.

మహారాజ్ దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్నా అతడు  భారత సంతతి వ్యక్తే. అతడి పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని  సుల్తాన్‌పూర్ కు చెందినవారు. కానీ కేశవ్ కుటుంబం చిన్నతనంలోనే సౌతాఫ్రికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది.

కేశవ్ హనుమాన్ భక్తుడు. తాను రాముడిని పూజిస్తాడని.. హనుమంతుడికి భక్తుడినని గతంలో ఓ కార్యక్రమంలో వెల్లడించిన విషయం తెలిసిందే.  ఇక పద్మనాభస్వామిని దర్శించుకున్న కేశవ్..  భారతీయులకు నవరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు.

ఇక ఇండియా-సౌతాఫ్రికాల మధ్య తిరువనంతపురంలో రేపు తొలి మ్యాచ్ జరగనుండగా రెండో మ్యాచ్ అక్టోబర్ 2న గువహతిలో మూడో మ్యాచ్ అక్టోబర్ 6న లక్నోలో జరగాల్సి ఉంది. తొల మ్యాచ్ కొరకు ఇప్పటికే ఇరు జట్లూ తిరువనంతపురం చేరుకున్నాయి.

click me!