Sai Sudharsan : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసి క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేస్తూ సెంచరీతో మెరిశాడు.
ఐపీఎల్ 2026లో యువ సంచలనం, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో బౌలర్లను ఉతికేస్తూ అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక బిగ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.
25
క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన సాయి సుదర్శన్
సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా, సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగుల మార్కును దాటేశాడు. ఈ జాబితాలో షాన్ మార్ష్ (52 ఇన్నింగ్స్), రుతురాజ్ గైక్వాడ్ (57 ఇన్నింగ్స్), కేఎల్ రాహుల్ (60 ఇన్నింగ్స్) వంటి దిగ్గజాలను సుదర్శన్ వెనక్కి నెట్టాడు.
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 58 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్‌లో ఇది అతనికి మూడో సెంచరీ కావడం విశేషం. ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించినా, ఒక్కసారి సెట్ అయ్యాక ఆర్సీబీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన ఓవర్‌లో స్కూప్ షాట్‌తో ఫోర్ కొట్టి, ఆపై పాయింట్ మీదుగా సిక్సర్ బాది తన ఫామ్‌ను చాటుకున్నాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో సిక్సర్ కొట్టి 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు గుజరాత్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మొదటి వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో వీరికి ఇది 8వ సారి వంద పరుగుల భాగస్వామ్యం. ఓపెనర్లుగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో వీరు రెండో స్థానానికి చేరుకున్నారు. గిల్ 24 బంతుల్లో 32 పరుగులు చేసి స్ట్రైక్ రొటేట్ చేయడానికే పరిమితం కాగా, సుదర్శన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.
55
భారత ఆటగాళ్లలో మరో ఘనత
అత్యంత వేగంగా అంటే ఎదుర్కొన్న బంతుల పరంగా 2000 పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సుదర్శన్ ఆరో స్థానంలో నిలిచాడు. సుదర్శన్ 1361 బంతుల్లో ఈ ఘనత సాధించగా, అభిషేక్ శర్మ (1193 బంతులు) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీపై ఐపీఎల్ సెంచరీ చేసిన 14వ బ్యాటర్‌గా, గుజరాత్ టైటాన్స్ తరపున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా అంటే గిల్ తర్వాత సుదర్శన్ నిలిచాడు. చివరకు హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సుదర్శన్ 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.