Mumbai Indians : హార్దిక్‌కు షాక్.. ముంబైకి మళ్లీ రోహితే బాస్? రేసులో ఉన్న ఆ నలుగురు వీరే !

Published : Apr 24, 2026, 05:36 PM IST

Mumbai Indians New Captain: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాండ్యాను తొలగిస్తారు అనే చర్చ సాగుతోంది. అయితే, ముంబై జట్టు కొత్త కెప్టెన్ రేసులో ఉన్న 4 ఆటగాళ్లు ఎవరో మీకు తెలుసా?

PREV
16
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు తప్పదా? హార్దిక్ ప్లేస్‌లోకి వచ్చేది ఎవరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. నీతా అంబానీ నేతృత్వంలోని ఈ మేనేజ్‌మెంట్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ డి కాక్ వంటి విధ్వంసకర ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకోవడంతో ఈసారి ముంబై జట్టు సునామీ రేపుతుందని అభిమానులు ఆశించారు. రోహిత్ శర్మ నుంచి జస్ప్రీత్ బుమ్రా వరకు దిగ్గజ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఈ జట్టు, మైదానంలోకి దిగాక మాత్రం ఘోరంగా విఫలమవుతోంది.

ముఖ్యంగా స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, టాప్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు సాధించడంలో తడబడుతున్నారు. దీని ప్రభావం జట్టు ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో ఆడిన మొదటి 7 మ్యాచ్‌ల్లో ముంబై ఏకంగా 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఏప్రిల్ 23న సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడం ముంబై చరిత్రలోనే అతిపెద్ద పరాజయంగా నమోదైంది.

26
హార్దిక్ కెప్టెన్సీపై పెరుగుతున్న ఒత్తిడి

గత మూడు సీజన్లుగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును నడిపిస్తున్నారు. అయితే, ఆయన నాయకత్వంలో జట్టు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. వరుస పరాజయాలు, ఆటగాళ్లను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శల నేపథ్యంలో, సోషల్ మీడియాలో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఒకవేళ మేనేజ్‌మెంట్ హార్దిక్‌ను పక్కన పెట్టాలని భావిస్తే, కెప్టెన్ రేసులో నలుగురు ఆటగాళ్లు ముందు వరుసలో ఉన్నారు. వారిలో..

36
రోహిత్ శర్మ : అందరి చూపు హిట్ మ్యాన్ వైపే

ముంబై ఇండియన్స్‌కు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఆయన ఒకరు. టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ 2024 గెలిపించిన రోహిత్, ఒత్తిడిని ఎదుర్కోవడంలో దిట్ట. మేనేజ్‌మెంట్ మళ్లీ ఒక సేఫ్, విన్నింగ్ ఆప్షన్ కావాలని అనుకుంటే, రోహిత్ శర్మ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అభిమానులు కూడా రోహిత్ మళ్లీ సారథిగా రావాలని కోరుకుంటున్నారు.

46
సూర్యకుమార్ యాదవ్ : మిస్టర్ 360కి ఛాన్స్?

మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్, ఇప్పటికే టీమిండియాను తన కెప్టెన్సీలో టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిపారు. ఐపీఎల్ 2026లో ఆయన బ్యాట్ కొంత ఇబ్బందిపడుతూ ఉన్నప్పటికీ, వ్యూహకర్తగా సూర్యకు మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. హార్దిక్ తర్వాత సహజంగానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అర్హత సూర్యకు ఉంది.

56
జస్ప్రీత్ బుమ్రా : బౌలర్ కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది?

2013 నుంచి ముంబై ఇండియన్స్ లో కీ ప్లేయర్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, ఈ లీగ్‌లో 152 మ్యాచ్‌ల్లో 185 వికెట్లు తీసిన అపార అనుభవం గల స్టార్ ప్లేయర్. బుమ్రా కేవలం సీనియర్ ఆటగాడు మాత్రమే కాదు, గేమ్‌ను అర్థం చేసుకోవడంలోనూ ముందుంటారు. ఇప్పటికే భారత టెస్టు జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఆయనకు ఉంది. పాట్ కమిన్స్ తరహాలో ఒక బౌలర్ కెప్టెన్‌గా ముంబై తలరాతను మార్చగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.

66
మిచెల్ సాంట్నర్ : ఇది ఒక సర్ ప్రైజ్ ఎంట్రీ

న్యూజిలాండ్‌కు చెందిన మిచెల్ సాంట్నర్ ఈ రేసులో ఒక సర్ ప్రైజ్ ఎంట్రీ అని చెప్పాలి. అంతర్జాతీయ స్థాయిలో కివీస్ జట్టును టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ వరకు నడిపించిన ఘనత ఆయనది. ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం, స్పిన్నర్లను సమర్థంగా ఉపయోగించుకోవడంలో సాంట్నర్ దిట్ట. విదేశీ కెప్టెన్ కావాలనుకుంటే సాంట్నర్ ముంబైకి బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

మరి ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఈ వరుస ఓటముల సమయంలో జట్టును గట్టెక్కించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories