Rohit Sharma Worst Record : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు జరుగుతోంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తీవ్రంగా నిరాశపరిచారు. రెండూ ఇన్నింగ్స్ లలోనూ ఈ స్టార్ ప్లేయర్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు.
Rohit Sharma
స్టార్ బ్యాటర్లు రాణించలేకపోయినా మొత్తంగా బంగ్లాదేశ్ తో తొలి టెస్టు రెండో రోజు వరకు భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో అధిపత్యం చెలాయించింది. రెండో ఇన్నింగ్స్ లో 81-3 పరుగులతో ఉన్న టీమిండియాకు ఇప్పటికే 308 పరుగుల అధిక్యం లభించింది. కానీ, భారీ ఇన్నింగ్స్ లను ఆశించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి అందుకు తగ్గ స్థాయిలో బ్యాట్ నుంచి పరుగులు రాలేదు.
చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు. సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. చెత్త రికార్డును తన పేరుమీద లిఖించుకున్నాడు. రోహిత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్, రెండో ఇన్నింగ్స్‌లో తస్కిన్ అహ్మద్ అవుట్ చేశారు. టెస్టుల్లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌లో ఔట్ కావడం ఇది నాలుగోసారి.
Rohit Sharma
చెపాక్ స్టేడియంలో జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీమ్ టీమిండియాను తొలుత బ్యాటింగ్ చేయమని కోరింది. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 19 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. బంగ్లాదేశ్ యంగ్ బౌలర్ హసన్ హసన్ మహమూద్ బౌలింగ్ లో ఆ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.
రెండో ఇన్నింగ్స్ లో కూడా రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ 7 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులతో పెవిలియన్ కు చేరాడు. రెండో ఇన్నింగ్స్ లో తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో జాకీర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
అంతకుముందు 2015లో గాలెలో శ్రీలంకపై రెండు ఇన్నింగ్స్ లలో రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. అదే ఏడాది 2015లో ఢిల్లీలో దక్షిణాఫ్రికాపై కూడా రెండు ఇన్నింగ్స్ లలో రెండంకెల స్కోర్ ను అందుకోలేకపోయాడు. 2023లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై ఒక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌తో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడు మరోసారి బంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా రెండు ఇన్నింగ్స్ లలో సింగిల్ డిజిట్ కే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మార్చి తర్వాత తొలిసారిగా టెస్టు ఆడేందుకు వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ సాధించాడు. సిరీస్‌లో 400 పరుగులు కూడా చేశాడు. కానీ, బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ లలో నిరాశపరిచాడు.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే భారత్ 308 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శుభ్‌మన్ గిల్ 33 పరుగులతో క్రీజులో ఉండగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ ను పెద్ద స్కోర్ చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. సూపర్ బౌలింగ్ తో బంగ్లా టీమ్ ను 149 పరుగులకే పరిమితం చేశారు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రాకు తోడుగా మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు, ఆకాశ్ దీప్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు అశ్విన్ సూపర్ సెంచరీ (113 పరుగులు), జడేజా హాఫ్ సెంచరీ (86 పరుగుల) ఇన్నింగ్స్ లతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌట్ అయింది.